సామూహిక హోమాలతో ఆధ్యాత్మిక వాతావరణం
ముగిసిన రెండు రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలు
యంత్ర ప్రతిష్టకు సన్నాహాలు పూర్తి
వెంకటాపూర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్న సందర్భంగా ఆదివారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే గణపతి పూజతో పాటు సామూహిక హోమాలు నిర్వహించగా, అనంతరం లక్ష్మీ పూజలు, ధాన్యాధివాసం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా విగ్రహాన్ని ధాన్యంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి, సకల సంపదలు కలగాలని భక్తులు ప్రార్థనలు చేశారు. భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక హోమాలు, లక్ష్మీ పూజల్లో పాల్గొన్నారు. మొత్తం 100 హోమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ నూనె నరేష్ తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటల 29 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట, వాస్తు పూజ, ప్రాణ ప్రతిష్ట, దిష్టి కుంభం వంటి ముఖ్య ఘట్టాలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.






