మానుకోట విద్యాశాఖకు అవినీతి మకిలి
ఏసీబీ ఘటనతో బయట పడ్డ అవినీతి వ్యవహారం
పదో తరగతి పిల్లల నుంచి వసూళ్లు...?
ఇంచార్జీ అధికారుల ఇష్టారాజ్యం
మహబూబాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మెరుగైన విద్యా బోధనతో సమాజ నిర్దేశకులుగా నిలవాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు తప్పుడు మార్గం పడుతుండంతో మహబూబాబాద్ జిల్లా విద్యా శాఖ కు అవినీతి మకిలి అంటుకుంటుంది.
ఇటీవల గూడూరు మండల ఇంచార్జీ విద్యాధికారి, అయోధ్యా పురం జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్ హెచ్‌ఎం రవికుమార్, స్కూల్ అసిస్టెంట్ చంద్ర మౌళి తమ సహచర ఉపాధ్యాయుడికి పదవీ విరమణ తరువాత రావాల్సిన బెనిఫిట్ బిల్లులు చేయడానికి 45 వేల రూపాయల లంచం డిమాండ్ చేసి, 15 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సంఘటన మానుకోట జిల్లా విద్యా శాఖలో ఇంత కాలం గుట్టుగా జరుగుతున్న అవినీతి వ్యవహారానికి పరాకాష్టగా నిలిచింది. అవినీతి ఆస్కారం లేని విద్యా శాఖలో ఇద్దరు ఉపాధ్యాయులు అది కూడా సహచర ఉపాధ్యాయున్ని లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడం మానుకోట విద్యా శాఖలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
తప్పుడు బాటలో మార్గదర్శకులు
సమాజ నిర్దేశకులుగా నిలవాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు తప్పుడు బాటలో పయనిస్తున్న వ్యవహారాన్ని ఆదిలోనే అడ్డుకట్ట వేసే స్థితిలో పర్యవేక్షణ లేకపోవడమే ‘విద్యా’ శాఖకు చెడ్డపేరు తెచ్చిపెడుతోందనే విమర్శలు వస్తున్నాయి. నిరంతర పర్యవేక్షణ, నిఘా లేక పోవడంతో కొందరు వక్ర మార్గం పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇంచార్జీల ఇష్టారాజ్యం
మానుకోట జిల్లాలో విద్యా శాఖ పనితీరు పర్యవేక్షించడానికి రెగ్యులర్ అధికారులు లేక పోవడం ఒక కారణంగా చెబుతున్నారు. మండల విద్యాధికారులుగా హెడ్ మాస్టర్లకు ఇంచార్జీ ఇవ్వగా, జిల్లా విద్యాధికారి పదవి కూడా ఇంచార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఫలితంగా అదనపు బాధ్యతల వల్ల వారు పర్యవేక్షణ పై పెద్దగా పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనితో విద్యా వ్యవస్థ పనితీరు మహబూబాబాద్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
పదో తరగతి పరీక్షలకు విద్యార్థుల నుంచి వసూళ్లు
ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలు సందర్భంగా జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి పరీక్ష కేంద్రాల నిర్వహణ ఖర్చు పేరుతో విద్యార్ధుల నుంచి వసూళ్లకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒక్కో విద్యార్థి నుంచి 200 నుంచి 300 రూపాయల వరకు వసూలు చేసి మండల విద్యాధికారుల ద్వారా పరీక్షా కేంద్రాల నిర్వహణకు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
అంతా షటిల్ సర్వీసులు
పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్లో కొందరు మినహా అత్యధికులు పనిచేసే చోట నివాసముండకుండా ఇతర ప్రాంతాల నుంచి నిత్యం షటిల్ సర్వీసులు చేస్తున్నారు. రైళ్లు, బస్సులు, సొంత వాహనాల్లో నిత్యం విధులు నిర్వహించే చోటుకు వచ్చి వెళుతున్నారు. దీని వల్ల అనేక పాఠశాలల్లో ‘సమయ పాలన’ గాడితప్పిందనే విమర్శలు వస్తున్నాయి. వేసవి కాలంలో నిర్వహిస్తున్న ఒంటి పూట బడి నిర్వహణ ఉపాధ్యాయుల షటిల్ సర్వీసుల వల్ల సమయ సారిణి అమలు కావడం లేదనే ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి.
రెగ్యులర్ అధికారులను నియమించాలి
జిల్లాలో కొనసాగుతున్న ఇంచార్జి మండల, జిల్లా విద్యాధికారుల స్థానాల్లో రెగ్యులర్ అధికారులను నియమించాలి. నిరంతర పర్యవేక్షణ సాగించాలి. సమయ పాలన పాటించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






