17 March, 2026 | 9:54 AM

హామీల అమలు ప్రణాళిక లేని ప్రసంగం

17-03-2026 02:13 AM
  1. పేదలకు భరోసానిచ్చే మార్గ నిర్దేశనమేదీ
  2. బీజేపీ సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

హైదరాబాద్, మార్చి 16 (విజయక్రాంతి) : గవర్నర్ ప్రసంగం అంతా ఒట్టి డొల్ల, సొల్లు పురాణమని, హామీల అమలు కార్యాచరణ ప్రణాళిక లేని ప్రసంగమని బీజేపీ సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అందులో ఎటువంటి దిశానిర్దేశం లేదని, రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో భ్రమలు, అవాస్తవాలు, అబద్దాలు చెప్పించిందన్నారు.

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల్లో రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల మూడు నెలల కాలంలో ఎన్ని హామీలను అమలు చేసిందో, మిగిలినవి ఎందుకు అమలు చేయలేకపోయిందనే వివరణ గవర్నర్ ప్రసంగంలో ఉంటుందని ప్రజలంతా భావించారని, కానీ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక, వాటిని ఎప్పటిలోగా అమలు చేస్తుందో చెప్పలేక పోయిందన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మహేశ్వర్‌రెడ్డి మాట్లాడారు.

గవర్నర్ ప్రసంగం ప్రజలను మభ్యపెట్టేలా ఉందే తప్ప హామీలను అమలు చేసేలా లేదని, తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వడంలో గవర్నర్ ప్రసంగం పూర్తిగా విఫలమైందన్నారు. రాజ్యాంగ అనివార్యత కోసమే గవర్నర్ ప్రసంగాన్ని రూపొందించారు తప్ప ఈ గవర్నర్  ప్రసంగ ఉద్దేశ లక్ష్యాలను కాంగ్రెస్ సర్కార్ విస్మరించిందన్నారు. 

ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీల వల్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏం ఒరిగిందనేది ఎక్కడ చెప్పలేకపోయిందని, ఇలాంటి పనికిమాలిన పాలసీలతో ఒరిగిందేమీ లేదన్నారు. ఇవి ప్రచార ఆర్భాట పాలసీలే తప్ప ప్రయోజనాల్ని చేకూర్చేవి కావని తెలిపారు. ఇది రోడ్ మ్యాప్ డాక్యుమెంట్ కాదని, పూర్తిగా ఫెయిల్యూర్  మోడల్ అని విమర్శించారు.