31 August, 2026 | 3:43 AM

అంగరంగ వైభవంగా పోచమ్మతల్లి విగ్రహ ప్రతిష్ఠాపన

31-08-2026 02:33 AM
  1. ఆలయ నిర్మాణానికి రూ.12 లక్షల భారీ విరాళం
  2. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

జిన్నారం, ఆగస్టు 30 : ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్నిపెంపొందించడంతో పాటు దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి (Member of the Legislative Assembly Gudem Mahipal Reddy) తెలిపారు. నూతన దేవాలయాల నిర్మాణాలకు సొంత నిధులు కేటాయిస్తూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, మాల సంఘం నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలలో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్నామని తెలిపారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావాన్ని పెంపొందించే వేదికలుగా నిలుస్తాయని అన్నారు.

జిన్నారం ప్రాంత ప్రజల భక్తి విశ్వాసాలకు అనుగుణంగా పోచమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం తనవంతుగా రూ.12 లక్షల భారీ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. దేవాలయ అభివృద్ధికి భవిష్యత్తులోనూ అవసరమైన సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, రాజేష్, స్థానిక కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.