29 August, 2026 | 8:35 AM

రిపోర్టర్ అవతారంలో రియల్ కబ్జాకోరు

29-08-2026 01:02 AM
  1. అబ్దుల్లాపూర్‌మెట్‌లో కోట్లాది విలువైన ప్రభుత్వ భూమి స్వాహాకు కుట్ర!
  2. రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి 

రంగారెడ్డి/ఆదిభట్ల,అగస్టు 28(విజయ క్రాంతి): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మరియు ఇంజాపూర్ రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండాపోతోంది. ఒకవైపు అక్రమాలను అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ, కబ్జాదారులు మాత్రం కొత్త వేషాల్లో భూమిని దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ప్రైవేట్ భూమికి ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయల విలువైన సర్కారు స్థలాలను కలుపుకుని యథేచ్ఛగా అక్రమ రవాణా, నిర్మాణాలు సాగిస్తున్నారు.

బెదిరింపులు.. ప్లానర్గా దందా...

ఈ అక్రమ ఆక్రమణల వెనుక ఒక సంచలనాత్మక కోణం వెలుగుచూసింది. ఒక వ్యక్తి ‘రిపోర్టర్’ ముసుగు తొడిగి, లోపల ‘టౌన్ ప్లానర్’గా అవతారమెత్తి ప్రత్యేకంగా కార్యాలయాన్ని నడుపుతున్నట్లు స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులను జర్నలిజం పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తూ, ఒత్తిడి తెచ్చి అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక అధికారులకు లొంగకపోతే వారిపై నిందలు వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారనే ప్రచారం స్థానికంగా కలకలం రేపుతోంది.

రూ. 1 కోటి విలువైన భూమిపై కన్ను  సర్వే నంబర్ 66 కథేంటి?..

కబ్జాదారులు సర్వే నంబర్ 42కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 66లోని విలువైన ప్రభుత్వ భూమిపై కన్నువేశారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం గజం ధర రూ.70 వేలకు పైనే పలుకుతుండటంతో, దాదాపు రూ. 1 కోటి విలువ చేసే సర్కారీ స్థలాన్ని క బ్జా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల పేర్లను వాడుకుంటూ స్థానికులను భయపెట్టే యత్నం చేశారు.  విషయం తెలుసుకున్న స్థానికులు ఫిర్యాదు చేయడం తో అబ్దుల్లాపూర్ మెట్ ఆర్‌ఐ  మహేష్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకు ని అక్రమంగా వేసిన నిర్మాణాలను తక్షణమే కూల్చివేశారు.

అనుమతులు ఎవరిచ్చారు..?

గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇటువంటి అక్రమ యత్నాలు జరగ్గా రెవెన్యూ యం త్రాంగం కూల్చివేతలు చేపట్టింది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 10కి పైగా అక్రమ గృహ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిని కలుపుకుని కట్టిన నిర్మాణాలకు మున్సిపల్/జిహెచ్‌ఎంసీ అధికారులు అనుమతులు ఎలా మంజూరు చేశారు? నిబం ధనలను తూర్పారబట్టి పర్మిషన్లు ఇచ్చిన వెనుక ఎంతటి ముడుపుల వ్యవహారం దాగి ఉంది?...  ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి ఈ భూ దందాపై సమగ్ర వి చారణ జరిపి అసలు సూత్రధారులు, పాత్రధారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్, శంషాబాద్ జోనల్ కమిషనర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

సర్వే చేపట్టాలి..

సర్వే నంబర్లు 44, 66 పరిధిలోని ప్రభుత్వ భూములను రెవెన్యూ డిపార్ట్మెంట్ వెంటనే  చేసి హద్దులు ఏర్పాటు చేయాలి.  ప్రభుత్వ ఆస్తులను కాపాడి ప్రజా అవసరాలకు వినియోగించాలని, కబ్జాదారులపై పీడీ యాక్ట్ నమోదు చేయడంతో పాటు అక్రమ అనుమతులకు సహకరించిన అధికారులను చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.