calender_icon.png 17 February, 2026 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంతం నెగ్గింది.. పీఠం దక్కింది..!

17-02-2026 01:24:17 AM

భైంసా బల్దియాపై స్వతంత్ర జెండా

70 ఏళ్లలో తొలిసారి అవకాశం

చైర్మన్‌గా తూమోల్ల దత్తాత్రి, వైస్ చైర్మన్‌గా బీబీ కుతిజా సిద్ధిఖా ప్రమాణ స్వీకారం

ఎంఐఎంలో నిరాశ

భైంసా మున్సిపాలిటీలో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. బల్దియా ఆవిర్భావం నుంచి ఐదు పర్యాయాలు కాంగ్రెస్ (1956 అటు తరువాత 2005లో (టీడీపీ) మినహా నాలుగు పర్యాయాలు ఎంఐఎం (1995- 2005) (2014 అధికార పీఠం కైవసం చేసుకుంటూ వస్తున్నాయి. ఈసారి ఐదోసారి సైతం అధికార పీఠంపై ఎంఐఎం కన్నేయగా, ఇద్రిజ్ వర్గానికి చెందిన ఇద్దరు స్వతంత్రులు వారి ఆశలకు గండి కొట్టారు. 12 స్థానాల్లో గెలవడంతో అధికారానికి దూరమైంది.

ఇక, ఆరు స్థానాల్లో బీజేపీ, ఒకచోట కాంగ్రెస్ గెలుపొందగా, ఏడు చోట్ల గెలిచిన స్వతంత్రులు అధి కా ర పీఠం దక్కించుకోవడంలో కీలకంగా మారా రు. ఎన్నికల ఫలితాలు వెలువడింది మొదలు ఆసక్తికర పరిణామాల నడుమ ఎట్టకేలకు బీజేపీ, కాంగ్రెస్ మద్దతుతో స్వతంత్రులు అధికారం కైవసం చేసుకున్నారు. 70 ఏళ్ల మున్సి పల్ చరిత్రలో తొలిసారి ఒక స్వతంత్ర అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

భైంసా/నిర్మల్, ఫిబ్రవరి ౧6 (విజయక్రాంతి): ముధోల్‌లో బీజేపీ నుంచి పోటీచేసి గెలుపొందిన ఎమ్మెల్యే పి.రామారావు పటేల్ ఆది నుంచి మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేస్తామని చెబుతూ వస్తున్నారు. ఇటీవ ల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోనూ ఎంఐఎంను తూర్పార పడుతూ విమర్శలకు ఎక్కుపె ట్టారు.

అంతేగాక, ఎంఐఎం వ్యతిరేక వర్గం నేత మీర్జా ఇద్రిజ్ బేగ్ సైతం ఈసారి 17 స్థానాల్లో స్వతంత్రులను నిలిపారు. ఇటు కాంగ్రెస్ నుం చి ఆ పార్టీ ఇన్చార్జి బి నారాయణ్‌రావు పటేల్ సైతం 25 వార్డుల్లో తమ అభ్యర్థులను నిలిపారు. ఫలితంగా ఎంఐఎంను 12 స్థానాలకే పరిమితం చేశారు. అయితే, ఈసారి భిన్నంగా స్వతంత్రులు(7) అధిక స్థానాల్లో గెలవడం, బీజేపీ (6), కాంగ్రెస్(1) మద్దతుతోపాటు ఎక్స్ అఫీషియోగా ఎమ్మెల్యే(1) తోడవడంతో చైర్మ న్, వైస్ చైర్మన్ ఎన్నిక లాంఛనమైంది. 

23వవార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన తూమోల్ల దత్తాత్రి చైర్మన్‌గా, 25వ వార్డు నుంచి గెలుపొందిన మరో స్వతం త్ర అభ్యర్థి బీబీ కుతిజా సిద్ధిఖా వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారంతోపాటు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక కార్యక్రమం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమ వారం జరిగింది. ముందుగా మీర్జా ఇద్రిజ్ బేగ్ తన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో కలిసి పట్టణంలోని ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసానికి చేరుకోగా, అక్కడి నుంచి ఏడుగురు స్వతంత్రులు, 6గురు బీజేపీ, ఒక కాంగ్రెస్ అభ్యర్థితో కలిసి వాహనాల్లో మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు ఎంఐఎం అభ్యర్థులు 11 మంది కూడా చేరుకున్నారు.

ఒకరు గైర్హాజరయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ముందుగా ఎన్నికల అధికారులు కౌన్సిలర్ అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఎంఐఎం నుంచి అబ్దుల్ ఖాదర్ (1వార్డు) చైర్మన్ అభ్యర్థిగా ఆమేర్ అహ్మద్(2వార్డు) ప్రతిపాదించగా, నాజిర్ అహ్మద్ (17వార్డు) బలపరిచారు. అలాగే వైస్ చైర్మన్గా దగ్దే నమ్రత(13వార్డు) పేరును అబ్దుల్ మాజిద్(21వార్డు) ప్రతిపాదించగా, ఫైజుల్లాఖాన్ (16వార్డు) బలపరిచారు. వీరి సంఖ్యాబలం 11 మాత్రమే ఉంది.

అయితే, స్వతంత్ర అభ్యర్థి తూమోల్ల దత్తాత్రిని చైర్మన్ అభ్యర్థిగా నిమ్మల ప్రవీణ్(14వార్డు) ప్రతిపాదించగా, ధర్మవరం శ్రీనివాస్(12వార్డు) బలపరిచారు. వైస్ చైర్మన్ అభ్యర్థిగా బీబీ కుతిజా సిద్దిఖా పేరును వడ్నం శ్రీనివాస్(11వార్డు) ప్రతిపాదించగా, దగ్డే శ్రీకాంత్(10వార్డు) బలపరిచారు. వీరికి 14 మంది అభ్యర్థులు, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓటుతో 15 మంది మద్దతు లభించింది. దీం తో వీరి ఎన్నిక లాంఛనం కాగా, అధికారులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 

ప్రమాణ స్వీకారం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్దకు భారీగా జనం చేరుకున్నారు. ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా పోలీసులు కొద్ది దూరంలోనే బారికేడ్లు ఏర్పా టు చేసి నియంత్రించారు. స్వతంత్రులు, బీజేపీ అభిమానులతోపాటు ఇద్రిజ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్నిక అనంతరం అభిమానులు టపాసులు పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. 

ఎస్పీ పరవేక్షణలో బందోబస్తు ..

భైంసా మున్సిపాలిటీలో సోమవారం నిర్వహించిన మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో భారీ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించుకునేందుకు పోలీస్ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మున్సిపల్ కౌన్సిలర్లు మాత్రమే లోనికి అనుమతిచ్చారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సాయి సాంకేత్ కుమార్, పోలీసులు ఉన్నారు.