17-02-2026 01:25:12 AM
నిజామాబాద్, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ముగిసా యి. నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్/డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్/వైస్ చైర్ పర్సన్ ల ఎన్నిక కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక సమావేశాలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి మార్గనిర్దేశంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
నిజామాబాద్ నగరపాలక సంస్థ సమావేశానికి నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించగా, బోధన్, ఆర్మూర్ లలో సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, భీంగల్ లో జెడ్పీ సీ.ఈ.ఓ సాయగౌడ్ పీ.ఓగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు ఉదయం 11.00 గంటలకు ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఆయా పార్టీల వారీగా సభ్యులు సమావేశ హాలు లోకి చేరుకున్నారు.
తెలుగు అక్షరమాలను అనుసరి స్తూ వరుస క్రమంలో నూతనంగా ఎన్నికైన సభ్యులతో ప్రిసైడింగ్ అధికారులు ముందు గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా హోదా కలిగిన ఎం.పీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు సైతం స్పెషల్ మీటింగ్ లకు హాజరై మేయర్/డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్/ వైస్ చైర్ పర్సన్ ఎన్నికలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీ.హెచ్.సత్యనారాయణ రెడ్డి ఎన్నిక ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించారు.
మద్యాహ్నం 12.30 గంటలకు సరిపడా కోరం ఉందని నిర్ధారించుకున్న మీదట ఎన్నిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ పదవి కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా 49వ డివిజన్ నుండి ఎన్నికైన కూరగాయల ఉమా రాణి పేరును ఆ పార్టీకి చెందిన సభ్యుడు అగ్గు బోజన్న ప్రతిపాదించగా, అబుద్ బిన్ అథర్ బలపర్చారు. అలాగే, భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా జి.స్రవంతి రెడ్డి పేరును వీరమాచినేని ప్రమోద్ కుమార్ ప్రతిపాదించగా, ఎర్రం సుధీర్ బలపర్చారు.
డిప్యూటీ మేయర్ పదవి కోసం ఎ.ఐ.ఎం.ఐ.ఎం తరఫున సల్మా తహసీన్, బీజేపి అభ్యర్థిగా బంటు రాము పోటీ పడ్డారు. దీంతో అధికారులు చేతులెత్తే విధానం ద్వారా ఎన్నిక జరిపించారు. నగర పాలక సంస్థలో మొత్తం 60 డివిజన్ కార్పొరేటర్ లతో పాటు నిజామాబాద్ ఎం.పీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డిలు ఎక్స్ అఫీషియో హోదాలో ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.
మొత్తం 65 మంది సభ్యులకు గాను 34 మంది సభ్యులు కాంగ్రెస్ అభ్యర్థిని కూరగాయల ఉమారాణిని మేయర్ గా, ఎఐఎంఐఎం అభ్యర్థిని సల్మా తహసీన్ ను డిప్యూటీ మేయర్ గా ఎన్నుకుంటూ మద్దతు తెలిపారు. బీజేపీ అభ్యర్థులుగా పోటీ పడిన జి.స్రవంతి రెడ్డి, బంటు రాములకు 31 మంది మద్దతు లభించింది.
దీంతో నిజామాబాద్ నగర మేయర్ గా ఉమారాణి, డిప్యూటీ మేయర్ గా సల్మా తహసీన్ లు ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ అధికారి ప్రకటించి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ స్వీయ పర్యవేక్షణ జరుపుతూ తగిన సూచనలు చేశారు. ఎట్టకేలకు ఎలాంటి గందరగోళానికి తావులేకుండా ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం, వీడియో చిత్రీకరణ నడుమ పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నికల ప్రక్రియను జరిపించారు.
బోధన్‌లో..
ఇదే తరహాలో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ గా తూము పద్మాశరత్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా ఇలియాస్ అలీని, ఆర్మూర్ లో...ఆర్మూర్ లో మున్సిపల్ చైర్ పర్సన్ గా లహరి స్వామి, వైస్ చైర్ పర్సన్ గా కాటిపల్లి వెంకట్ రెడ్డిని, భీంగల్ లో మున్సిపల్ చైర్ పర్సన్ గా బి.నాగమణి స్వామి, వైస్ చైర్ పర్సన్ గా లతలను ఎన్నుకున్నారు.
మేయర్/డిప్యూటీ మేయర్, చైర్ పర్సన్/ వైస్ చైర్ పర్సన్‌ల ఎన్నికను పురస్కరించుకుని ఎలాం టి అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా మున్సిపల్ కార్యాలయాల వద్ద కట్టు దిట్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద అదనపు డీ.సీ.పీ బస్వారెడ్డి, ఏ.సీ.పీ ప్రకాష్ ఇతర పోలీసు అధికారులు బందోబస్తును పర్యవేక్షించారు.