4 March, 2026 | 4:14 PM

టాలీవుడ్‌లోకి హుజురాబాద్ కుర్రోడు

04-03-2026 12:00 AM

రవం చిత్రంతో హీరోగా ఎంట్రీ

హుజురాబాద్,మార్చి3  (విజయ క్రాంతి) టాలీవుడ్ లోకి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ చెందిన కుర్రాడు రాధారపు ప్రశాంత్ రవం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇ స్తున్నాడు.రాధారపు ప్రశాంత్ తన చిన్ననాటి కలని నిజం చేసుకుంటూ వెండితెరపై హీరోగా మెరవబోతున్నారు. సినిమా రం గంపై ఉన్న మక్కువతో పట్టుదలతో శ్రమించిన ప్రశాంత్ త్వరలో విడుదల కానున్న ’రవం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

చిన్నతనం నుండే సినిమాలపై ఉన్న ఆసక్తితో ఎలాగైనా స్క్రీన్ పైన కనపడాలనే ధృడ సంకల్పంతో ప్రశాంత్ ముందుకు సాగారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తన ప్రతిభను నిరూపించుకోవడంతో పాడాల తారక రామారావు నిర్మాతగా, రామ్ మన్నార్ దర్శకత్వంలో తెరకెక్కిన ’రవం’ మూవీలో హీరోగా నటించే అద్భుతమైన అవకాశం దక్కించుకున్నారు.

ఆహాలో విడుదల...

ఈ చిత్రం ఈనెల 6వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ’ఆహా’ లో గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ వార్త తెలియడంతో హుజురాబాద్లోని విద్యానగర్లో సందడి నెలకొంది. తమ స్నేహితుడు, తమ ప్రాంత వాసి హీరోగా గుర్తింపు పొందడంపై ప్రశాంత్ మిత్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చి తన స్వయంకృషితో ఈ స్థాయికి చేరుకున్న ప్రశాంత్ యువతకు ఆదర్శమని అతని స్నేహితులు కొనియాడారు.

సినిమా ఘనవిజయం సాధించాలని, ప్రశాంత్ మరిన్ని చిత్రాల్లో నటించి ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షిస్తున్నారు. సైదాపూర్ మండలం జాగిరిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్ కుటుంబం హుజురాబాద్ పట్టణంలో స్థిరపడింది.