రోడ్డుపోత.. సాగతీత..
- ఏడాది దాటిన సాగని పనులు
- ప్రయాణానికి వాహనదారుల అవస్థలు
- త్వరగా పనులు ప్రారంభించాలని ప్రయాణికుల వేడుకోలు
కోదాడ, మే 4: అనంతగిరి - శాంతినగర్ మార్గమధ్యంలో మొగలాయకోటకు వెళ్లే సుమారు రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి గత ఏడాది జనవరి 1న ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. స్థానిక ప్రజల్లో భారీ ఆశలు రేకెత్తించిన ఈ కార్యక్రమం తర్వాత, పనులు వేగంగా పూర్తవుతాయని హామీలు ఇచ్చినా, ఏడాది గడిచినా పనులు ప్రారంభం కాకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోంది.
ఈ రహదారి అనేక గ్రామాలకు ప్రధాన రాకపోకల దారి కావడంతో, ఇది పూర్తయితే ప్రయాణ సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, విద్యార్థులు, రైతులు, ఉద్యోగులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని గ్రామస్తులు భావించారు. కానీ పనులు ప్రారంభం కాకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రహదారి పూర్తిగా గుంతల మయంగా మారి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. వర్షాకాలంలో గుంతలు మరింత ప్రమాదకరంగా మారి, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
రెండు చక్రాల వాహనదారులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని, గాయాలపాలైన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణం చేయడం మరింత కష్టంగా మారింది. ఈ పరిస్థితి అత్యవసర సేవలపైనా ప్రభావం చూపుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారిని ఆసుపత్రులకు తరలించడం కష్టంగా మారగా, గర్భిణీలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తమ పంటలను మార్కెట్కు తరలించడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు.
బస్సు సౌకర్యం లేక గ్రామస్తుల కష్టాలు
మొగలాయకోట గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ప్రజలు సమీప ప్రాంతాలకు వెళ్లాలంటే ఆటోలు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లడంలో ఇబ్బందులు పడుతుండగా, ఉద్యోగులు సమయానికి చేరుకోవడం కష్టమవుతోంది.
అత్యవసర పరిస్థితుల్లో సరైన రవాణా లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి రహదారి పనులను ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు, గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకపోతే ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
రోడ్డు బాగోలేక ఇబ్బందులు పడుతున్నాం
రోడ్డు గుంతలమయంగా మారడంతో రాకపోకలు సాగించాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. శంకుస్థాపన చేసి ఏడాది దాటినా పనులు పూర్తికాకపోవడం విచారకరం. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చూడాలి.
- భూక్యా బోస్, అనంతగిరి






