5 May, 2026 | 3:32 AM

పీఏసీఎస్‌లలో నామినేటెడ్ ‘కొలువు’..

05-05-2026 02:08 AM

జిల్లాలో మొదలైన రాజకీయ సందడి

పదవులపై ఆశలు పెట్టుకున్న కిందిస్థాయి నేతలు

రంగారెడ్డి, మే 4 (విజయక్రాంతి): ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (సింగిల్ విండో) పాలకవర్గాల భర్తీ ప్రక్రియ ఊపందుకుంది. ప్రభుత్వం ఈసారి ఎన్నికల నిర్వహణకు బదులుగా నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయాలని నిర్ణయించడంతో, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికే ఇన్చార్జ్ అధికారుల పాలనలో ఉన్న సంఘాలకు త్వరలోనే కొత్త సారథులు రానున్నారు. నామినేటెడ్ పదవులు అన్ని ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే ఎంపిక ఉండనుంది.మార్కెట్ కమిటీల తరహాలోనే సహకార సంఘాల బాధ్యతలను కూడా పార్టీ క్యాడర్కు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పలువురు ఆశావాహులు సింగిల్ విండో పై ఆశలు పెట్టుకున్నారు. పదవి దక్కించుకునేందుకు భారీగా ఖర్చు పెట్టేందుకు సైతం సై అంటున్నారు.

ఎమ్మెల్యేలదే నిర్ణయాధికారం..

నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేసిన ద్వితీయ శ్రేణి నాయకులకు ఈ పదవుల ద్వారా న్యాయం చేయాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల కోసం ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, కందుకూరు, చేవెళ్ల, మహేశ్వరం, వంటి ప్రాంతాల్లో నాయకులు ఇప్పటికే ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు.

ఎంపికలో సామాజిక సమీకరణాలు..

నామినేటెడ్ సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉండటంతో, ఆయా వర్గాల నుంచి బలమైన అభ్యర్థుల వేట మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో సహకార వ్యవస్థ రైతులకు వెన్నుముకగా నిలుస్తోంది. జిల్లాలో  మొత్తం సంఘాలు సుమారు 30కి పైగా క్రియాశీల పీఏసీఎస్లు ఉన్నాయి.

ప్రధాన కార్యకలాపాలు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ, ఎరువులు, విత్తనాల పంపిణీ సాగుతోంది. ప్రస్తుత స్థితి గతేడాది పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం జిల్లా సహకార అధికారి (డిసీఓ) పర్యవేక్షణలో ఇన్చార్జ్ పాలన సాగుతోంది.ఆర్థిక లావాదేవీలు జిల్లాలోని డీసీసీబీ  శాఖల ద్వారా కోట్ల రూపాయల పంట రుణాలు ఈ సంఘాల ద్వారానే రైతులకు అందుతాయి.

నాడు ఎన్నికలు.. నేడు నామినేటెడ్..

గతంలో 13 మంది డైరెక్టర్లను రైతులు నేరుగా ఎన్నుకునేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి, 3 నుంచి 5 మంది సభ్యులతో చిన్నపాటి కమిటీలను వేసే యోచనలో ఉంది.పాలకవర్గాల గడువు ముగిసి ఏడాది దాటిన నేపథ్యంలో, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇన్చార్జ్ అధికారులను నియమించింది. ఇప్పుడు రాజకీయ నియామకాల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

రైతు వర్గాల్లో చర్చ సహకార సంఘాలు కేవలం రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదని, రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు అందించే సమర్థులను నియమించాలని సామాన్య రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన మండలాల్లో  సంఘాల ఏర్పాటుపై స్పష్టత రావాలని వారు కోరుతున్నారు.త్వరలోనే అధికారిక మార్గదర్శకాలు విడుదల కానుండటంతో, జిల్లా రాజకీయాలు ఇప్పుడు ‘సహకార‘ చుట్టూ తిరుగుతున్నాయి.