5 May, 2026 | 4:42 AM

బెంగాల్ గడ్డపై బీజేపీ విజయఢంకా

05-05-2026 03:08 AM

సునామీ మమతకు పరాభవం

వంగ భూమిపై ‘కమల’ వికాసం

  1. అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం
  2. 294 స్థానాల్లో ౨౦౬ స్థానాలు కైవసం
  3. టీఎంసీకి 80 చోట్ల విజయం ఖరారు
  4. ఒక చోట ఆధిక్యం
  5. జాతీయ పార్టీ కాంగ్రెస్ ౨ స్థానాలకు పరిమితం
  6. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలించిన సీపీఎంకి ఒకే ఒక్క సీటు

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోటలు కూలాయి. మమత నాయకత్వంలోని ౧౫ ఏళ్ల టీఎంసీ పాలనను అనూహ్యంగా బీజేపీ నిలువరించింది. కేంద్రమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత సువేందు అధికారి నాయకత్వంలో బీజేపీ వ్యూహాత్మక పోరాటం సాగించింది. కర్ణుడు చావుకు కారణాలు వెయ్యి అన్నట్లుగా.. అనేక కారణాలతో టీఎంసీ ఓటమిపాలైంది. ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ బలంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లింది.

కోల్‌కతా, మే ౪: పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. సొంతంగా ౨౦౬ స్థానాలను కైవసం చేసుకున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ అంతకు ఎంతో మించి స్థానాలను దక్కించుకున్నది. అధికార టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. ఒక చోట ఆధిక్యంలో ఉంది. ఫలితాల్లో ఒకప్పుడు బంగాల్‌లో చక్రం తిప్పిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికల్లో నామరూపాల్లేకుండా పోయాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ కూడా రెండు స్థానాల్లోనే విజయం సాధించింది. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలంపాటు పాలించిన సీపీఎం ఒకే ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. ఆల్ ఇండియా సెక్యులర్ ఫ్రంట్ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.

ముఖ్యమంత్రి సువేందు?

బీజేపీ నుంచి ముఖ్యమంత్రి రేసులో పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి ఉన్నారు. ఆయన ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన చోటుచేసుకున్న సమయంలో ఆయన చేసిన పోరాటం అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. బంగాల్ రాజకీయాలపై పూర్తి పట్టు ఉన్న సువేందుకే ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో

రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భారీ విజయాన్ని సొంతం చేసు కుంది. ఆ పార్టీ ఏకంగా 213 సీట్లను గెలుచుకుని హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ 77 స్థానాలకు పరమితమైంది. నాడు వామపక్షాలు, కాంగ్రెస్ కూటమి ఒక్క సీటైనా గెలుచుకోలేకపోవడం గమనార్హం.

ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయదుందుభి మోగించింది. పశ్చిమ బెంగాల్‌లో.. చరిత్రలో మొదటిసారిగా ప్రభంజనం సృష్టించింది. మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని మట్టికరిపించింది. బీజేపీకి ఇది అనూహ్య విజయమే. అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ పీఠాన్ని తిరిగి దక్కించుకొని తీరుతామనుకున్న మమత కలలు కల్లలయ్యాయి. మహిళలు, ముస్లిం మైనార్టీల ఓట్లలో చీలిక వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది.

మమత ప్రభుత్వ వైఫల్యాలను బీజేపీ ఈ ఎన్నికల్లో తమదైన పోల్ మేనెజ్‌మెంట్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. సోమవారం సాయంత్రం వరకు కూడా టీఎంసీ ఓటమి పాలవుతున్నదని వాస్తవాన్ని మమతా బెనర్జీ జీర్ణించుకోలేకపోయారు. ఫలితాల ప్రకటనలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని దీదీ ఆరోపించారు. ఇక అసోంలో ఊహించినట్లుగానే సీఎం హిమంత బిశ్వ శర్మ నాయకత్వంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించింది. ౧౨౬ స్థానాలున్న అసోం అసెంబ్లీలో బీజేపీ సొంతంగా ౮౨ నియోజకవర్గాల్లో విజయాన్ని కైవసం చేసుకుంది. పుదుచ్చేరిలోనూ ఎన్డీఏ ఘన విజయం సాధించింది. సీఎం రంగసామి నాయకత్వంలో ఎన్డీఏ అక్కడ ఊహించినట్లుగానే గెలుపునందుకుంది. 

తమిళనాడులో ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని టీవీకే అధికారంలోకి రానున్నట్లు ఆ సంస్థ చెప్పిన జోస్యం నిజం కాబోతున్నది. అనూహ్యంగా తమిళ నాడులో విజయ్ తన విశ్వరూపం ప్రదర్శించారు. దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకున్న డీఎంకే, అన్నాడీఎంకేలను వెనక్కినెట్టి విజేతగా నిలిచారు. సంప్రదాయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు ఈసారి టీవీకేకు పట్టం కట్టారు. కేరళంలో అవినీతిమయమైన పిన రయి విజయన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొట్టారు. అక్కడ యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. ఐదు దశాబ్దాల్లో తొలిసారి దేశంలో లెఫ్ట్ శకం ముగిసింది.