5 May, 2026 | 4:42 AM

ఏడోసారీ ఓడిన తమిళిసై

05-05-2026 03:20 AM
  1. మైలాపూర్ నియోజకవర్గంలో 32 వేల ఓట్లతో మూడోస్థానం
  2. 28వేల ఓట్లతో టీవీకే అభ్యర్థి విజయం
  3. మాజీ గవర్నర్‌కు కలిసిరాని ప్రత్యక్ష రాజకీయాలు

చెన్నై, 4: తెలంగాణ మాజీ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఏడోసారీ ఓడిపోయారు. తమిళనాడులోని మైలాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన ఆమె కేవలం 32 వేల ఓట్లు సాధించి మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఇక్కడ టీవీకే అభ్యర్థి వెంకటరమణాన్ 28వేల ఓట్ల తేడాతో గెలిచారు. డీఎంకే అభ్యర్థి వేలు దా 41 వేల ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. అయితే గతంలో తమిళిసై పార్లమెంట్ ఎన్నికల్లో 2009లో చెన్నై సౌత్ నుంచి, 2019లో తూత్తుకుడి నుంచి, 2024లో చెన్నై సౌత్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ మూడు సార్లు కూడా తమిళిసైపై డీఎంకే అభ్యర్థులే గెలుపొందారు.

అలాగే 2006లో రాధాపురం, 2011లో వేలిచేరి, 2016లో విరుగంబాక్కం అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఓడిపోయారు. 20 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆమె ఇప్పటి వరకు చట్టసభలకు ఎన్నిక కాలేదు. మూడు పర్యాయాలు పార్లమెంట్‌కు, నాలుగు పర్యాయాలు అసెంబ్లీకి పోటీ చేసినా కూడా ఆమెను అదృష్టం వరించలేదు. కాగా 2019 సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2024 మార్చి నెలలో తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేసి, తమిళనాడు ప్రత్యక్ష రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉన్నారు.