21 March, 2026 | 7:45 PM

యువత అగ్నివీర్ నియామకాలను సద్వినియోగం చేసుకోవాలి

21-03-2026 05:14 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి,(విజయక్రాంతి): భారత సైన్యంలో 2027 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీల్లో 'అగ్నివీర్' పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమైనట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం ప్రకటనలో తెలిపారు. వనపర్తి జిల్లాలోని అర్హులైన అవివాహిత యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా www.joinindianarmy.nic.in వెబ్‌సైట్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఏప్రిల్ 01, 2026 వరకు గడువు ఉందన్నారు.

అన్ని అగ్నివీర్ కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిని 21 ఏళ్ల నుండి 22 ఏళ్లకు పెంచడం జరిగిందన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్‌మెన్ (10వ తరగతి & 8వ తరగతి పాస్) కేటగిరి లకు నియామకాలు జరుగుతాయని చెప్పారు. ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్  అడ్మిట్ కార్డుల కోసం జూన్ 01 నుండి జూన్ 15, 2026 వరకు నిర్దేశించిన వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ పరీక్ష తెలుగుతో సహా 13 భాషల్లో అందుబాటులో ఉంటుందన్నారు. ఐటిఐ డిప్లొమా మరియు ఎన్‌సిసి  అర్హత కలిగిన అభ్యర్థులకు బోనస్ మార్కులు ఇవ్వబడతాయని తెలిపారు. ఈ నియామక ప్రక్రియ పూర్తిగా అత్యంత పారదర్శకంగా నిర్వహించబడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనే మోసగాళ్లను, దళారులను నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని, కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సందేహాల కోసం సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూటింగ్ కార్యాలయం ఫోన్ నంబర్ 040-27740059 ను సంప్రదించవచ్చు.