5 July, 2026 | 2:11 AM

సిస్టర్ నివేదితగా సెలీనా జైట్లీ

05-07-2026 12:30 AM

స్వామి వివేకానంద ముఖ్య శిష్యురాలైన ’సిస్టర్ నివేదిత’ జీవిత చరిత్ర వెండి తెరపైకి వస్తోంది. ‘సిస్టర్ నివేదిత’ అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. ఐరిష్ సంతతికి చెందిన ఆమె ఐర్లాండ్‌లో 1867లో జన్మించారు. 1895లో వివేకానంద బోధనలకు ఆకర్షితురాలై భారత్‌కు వచ్చారు. 1898లో వివేకానందుడి శిష్యరికాన్ని స్వీకరించి, సిస్టర్ నివేదితగా పేరు మార్చుకున్నారు. ఆధ్యాత్మికవేత్తగా, విద్యావేత్తగా, రచయిత్రిగా ఎంతో మందిని ప్రభావితం చేసిన సిస్టర్ నివేదిత 43 ఏళ్ల వయసులో 1911లో కన్నుమూశారు.

ఇప్పుడామె బయోపిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సిస్టర్ నివేదిత సమాజానికి చేసిన సేవలను, ఆమె త్యాగాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి రామ్ కమల్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ‘ఏక్ దువా’ అనే లఘుచిత్రంతో జాతీయ పురస్కారం అందుకున్న రామ్ కమల్.. ఈ బయోపిక్‌ను తెరకెక్కిస్తుండ టంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలేర్పడుతున్నాయి. అరిత్రా దాస్ క్రియేషన్స్, అసోసియేటెడ్ మోషన్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ దాదాపు 15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ బయోపిక్ ద్వారా పూర్తిస్థాయి పాత్రలో వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇస్తోంది. ఆమె చివరగా 2011లో ‘శ్రీమతి’ అనే కన్నడ చిత్రంలో ఉపేంద్ర సరసన హీరోయిన్‌గా నటించారు. తాజాగా వివేకానంద 124వ వర్ధంతిని పురస్కరించుకుని ‘సిస్టర్ నివేదిత’ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. చిత్రీకరణ పనులను వచ్చే ఏడాది శీతాకాలంలో ప్రారంభించనున్నారు. కథానేపథ్యం ప్రకారం కోల్‌కతా, ముంబయి, లండన్, ఐర్లాం డ్‌లో చిత్రీకరణ జరుపుతారు.

ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తుండటం.. ఇదొక చారిత్రక, పీరియడ్ డ్రామా కావటంతో కాస్టింగ్, కాస్టూమ్స్, ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతుంది. టైటిల్ రోల్ పోషిస్తున్న సెలీనా పేరు మాత్రమే ప్రస్తుతానికి అధికారికంగా ఖరారైంది. కథలో అత్యంత కీలకమైన వివేకానంద పాత్రతోపాటు రామకృష్ణ పరమహంస, శారదాదేవి వంటి చారిత్రక ప్రముఖుల పాత్రలను పోషించే నటీనటుల వివరాలను చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.