తెలంగాణ అప్పులెన్ని?
తెలంగాణ అప్పులపై రాజకీయ దుమారం
- అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం
- తాము అప్పు చేసింది తక్కువేనని, కాంగ్రెస్ ఎక్కువగా చూపిస్తుందని బీఆర్‌ఎస్ అభ్యంతరం
- బీఆర్‌ఎస్ రుణాలు తలకుమించిన భారమైందంటున్న కాంగ్రెస్
- రెండు పార్టీల వాదనలు ఎలా ఉన్నప్పటికీ.. ప్రజల్లో మాత్రం గందరగోళం
- వడ్డీలకే వేలకు వేల కోట్లు.. ప్రతి పౌరుడి తలపై లక్ష రుణం
- రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై ఆర్థిక నిపుణుల హెచ్చరికలు
- అప్పులపై స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ షురూ
* తెలంగాణ అప్పుల అంశం రాజకీయంగా పెద్దదుమారం రేపుతున్నది. 2014లో రాష్ట్ర అప్పులు రూ.72 వేల కోట్లు ఉండగా, బీఆర్‌ఎస్ పాలన ముగిసే నాటికి (2024) ఆ అప్పులు రూ. 4.15 లక్షల కోట్లకు పైగా చేరాయని అధికార కాంగ్రెస్ పేర్కొంటున్నది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ప్రతిపక్ష బీఆర్‌ఎస్ బలంగా ఖండిస్తున్నది. తాము తెచ్చిన ప్రతి రూపాయిని రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసమే ఖర్చు చేశామని సమర్థించుకుంటున్నది.
అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నది. రెండు పార్టీల వాదనలు, గణాంకాలు.. ఎలా ఉన్నా పెరుగుతున్న అప్పు ల భారం మాత్రం రాష్ట్ర ప్రగతికి ప్రతిబంధకంగా మారాయి.
రాష్ట్ర ఆదాయంలో సింహభాగం పాత అప్పులు, వడ్డీలకే సరిపోతున్నదని, బడ్జెట్‌లో యేటా రూ.20 వేల కోట్లకు పైగా కేవలం వడ్డీలు, మరో రూ.15,000 కోట్ల నుంచి రూ. 20,000 కోట్లు అసలుకు చెల్లించాల్సివస్తున్నదని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. వడ్డీ, అసలు చెల్లింపుల కారణంగా కొత్త ప్రాజెక్టులకు నిధులు కరువవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి కూడా కుంటుపడుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి కూడా కుంటుపడుతున్నాయి.
- ఎవరి హయాంలో ఎంత చేశారు
- గత ప్రభుత్వమే చేసిందంటున్న పాలకపక్షం
- మేము తెచ్చింది కొంతే, మీరు చేసిన వాటికి లెక్కలు చెప్పాలని ప్రతిపక్షం
- కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల పరస్పర ఆరోపణలు
- ప్రజల్లో గందరగోళం.. అప్పులపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్
- రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుపై నిపుణుల హెచ్చరికలు
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి) : తెలంగాణలో అప్పుల అంశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అధి కార, విపక్షాలు పరస్పర ఆరోపణలు, సవాళ్లు విసురుకుంటున్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, అందుకే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో ఆర్థిక ఇబ్బందులు ఎదు రవుతున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
మరోవైపు బీఆర్‌ఎస్.. రాష్ట్ర అభివృద్ధి కోస మే అప్పు చేశామని, వాటితో మిషన్ భగీరథ, ఉచిత విద్యుత్, రహదారులు, కాళే శ్వరం వంటి భారీ ప్రాజెక్టులు నిర్మించామని చెబుతోంది. మేము తెచ్చింది కొంతేనని, కాంగ్రెస్ ప్రభుత్వమే భారీగా అప్పులు చేస్తూ ఆ నెపాన్ని తమపై మోపుతుందంటూ ఎదురుదాడి చేస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. రాష్ట్ర అప్పులపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు తెలంగాణకు ఉన్న మొత్తం అప్పులెన్ని? ప్రత్యక్ష అప్పులు, కార్పొరేషన్ రుణాలు, హామీలు, పెండింగ్ బిల్లులు కలిపితే రాష్ట్రంపై ఉన్న నిజమైన భారం ఎంత? ఈ అప్పులు ఏ అవసరాల కోసం తీసుకున్నారు? వాటితో ఎ లాంటి ఆస్తులు సృష్టించారు? నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు నిజమైతే ఇప్పటి వరకు చట్టపరమైన చర్యలేవి? చివరికి ఈ అప్పుల భారాన్ని మోయాల్సింది ఎవరు? వంటి అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అప్పులపై స్పష్టత ఇవ్వాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.
2014 నుంచి ఇప్పటి వరకు..
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు సుమారు రూ.70 వేల కోట్ల పరిధిలో ఉన్నాయి. కొత్త రాష్ట్రం కావడంతో అభివృద్ధి అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం భారీగా రుణాలు తీసుకోవడం ప్రారంభించింది. మొదటి ఐదేళ్లలోనే అప్పులు రెండిం తలకు పైగా పెరిగాయి.
ఆ తర్వాత కాళేశ్వరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, విద్యుత్ రంగ విస్తరణ, రైతుబంధు, రైతు బీమా, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి పథకాలతో రుణభారం మరింత పెరిగింది. అప్పుల తీసుకురావడం నిరంతరం కొనసాగుతుండటంతో ఈ 12 ఏళ్లలో ప్రభు త్వ ప్రత్యక్ష అప్పులు దాదాపు ఆరు రెట్లు పెరిగాయి. అయితే ప్రతి ఏడాది రాష్ట్ర ఆదాయం పెరుగుతున్నా.. అదే స్థాయిలో రుణభారం కూడా వేగంగా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ఇవే పూర్తి అప్పులా?
వాస్తవానికి ప్రభుత్వం బడ్జెట్‌లో చూపిం చే ప్రత్యక్ష ప్రభుత్వ అప్పులు మాత్రమే రాష్ట్రంపై ఉన్న మొత్తం ఆర్థిక భారం కాదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ ఖజానా పేరుతో తీసుకున్న రుణాలు ఒక భాగం మాత్రమే అయితే వీటికి అదనంగా ప్రభుత్వ హామీలతో వివిధ కార్పొరేషన్లు, సంస్థలు తీసుకున్న రుణాలు, విద్యుత్ సం స్థల అప్పులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సంస్థల రుణాలు, పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు వంటి బాధ్యతలు కూడా ఉన్నాయి.
అంటే రాష్ట్రంపై ఉన్న రుణభారాన్ని అంచనా వేయాలంటే కేవలం ప్రభు త్వ ప్రత్యక్ష అప్పులు కాకుండా ఈ ఆఫ్- బారోయింగ్స్ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణ మొత్తం అప్పులపై వేర్వేరు గణాంకాలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు రూ.4 లక్షల కోట్లకు పైగానే ఉన్నాయని చెబుతుంటే, మరోవర్గం ప్రత్యక్ష అప్పులు, ప్రభుత్వ హామీలతో తీసుకున్న రుణాలు, కార్పొరేషన్ అప్పులు, పెండింగ్ బిల్లులు అన్నీ కలిపితే మొత్తం ఆర్థిక బాధ్యత రూ.6లక్షల కోట్లకు మించి ఉండొచ్చని అంచనా.
అయితే ఈ అంశంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు తెరపడాలంటే ప్రభుత్వం ప్రత్యక్ష రుణాలు, ప్రభుత్వ హామీలతో ఉన్న బాధ్యతలు, కార్పొరేషన్ రుణాలు, పెండింగ్ బిల్లులు, వడ్డీ భారం వంటి అన్ని వివరాలతో కూడిన శ్వేతపత్రాన్ని విడుదల చేయాలనే డిమాండ్ రోజురోజుకూ బలపడుతోంది.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పరస్పర ఆరోపణలు ఇవీ..
బీఆర్‌ఎస్ పాలనలో భారీగా అప్పులు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలోకి నెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ముఖ్యంగా కాళే శ్వరం, విద్యుత్ రంగం, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు, భారీ ప్రాజెక్టుల వ్యయ అంచనాల పెంపు వల్ల రాష్ట్రంపై అ ప్పుల భారం పెరిగిందని చెబుతోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అవినీతి, ఆర్థిక అక్రమాలు జరిగాయని, ప్రజాధనం దుర్వినియోగమైందని కూడా విమర్శిస్తోంది.
అందుకే నేడు ప్రభు త్వం పాత అప్పులు, వడ్డీలు చెల్లించడానికే భారీ మొత్తాలను వెచ్చించాల్సి వస్తోం దని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే ఇక్కడే కీలకమైన ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం నిజం గానే నిధుల దుర్వినియోగం, అవినీతి జరిగిందని చెబితే.. వాటిపై ఇప్పటి వరకు ఎ లాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంది? ఎన్ని విచారణలు ప్రారంభమయ్యాయి? ఎ న్ని కేసులు నమోదయ్యాయి? ఎంత నష్టం గుర్తించారు? ఎంత మొత్తాన్ని తిరిగి రాబట్టా రు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
రాజకీయ ఆరోపణలతోనే కాకుండా, విచారణ సంస్థల నివేదికలు, అధికారిక ఆధారాలు, కోర్టు ప్రక్రియల ద్వారా నిజానిజాలు ప్రజల ముందుకు వస్తేనే ప్రజల్లో ఉ న్న సందేహాలు తొలగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ఆరోపణలను బీఆర్‌ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. అప్పు చేయడం తప్పు కాదని, ఆ అప్పుతో రాష్ట్రానికి శాశ్వత ఆస్తులు సృ ష్టించామా అనేదే అసలు ప్రమాణం అని.. వాదిస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ, మిషన్‌కాకతీయ, విద్యుత్ రంగ విస్త రణ, రైతుబంధు, రైతుబీమా, రహదారులు, వైద్య, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం రుణాలు తీసుకున్నామని చెబు తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతి బడ్జెట్‌లో కొత్తరుణాలు తీసుకుంటూనే గత ప్రభుత్వంపై నెపం వేయడం సరికాదని బీఆర్‌ఎస్ ప్రశ్నిస్తోంది. అందుకే అప్పులపై రాజకీయ విమర్శల కంటే వాస్తవ గణాంకాలతో చర్చ జరగాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది.
తెలంగాణలో తీసుకున్న అప్పులన్నీ ఒకే రంగానికి ఖర్చుకాలేదు. గత పదే ళ్లలో ప్రభుత్వం భారీమౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సంక్షేమపథకాలు, విద్యుత్ రంగ విస్తరణ, సాగునీటి ప్రాజెక్టుల అమలుకు రుణాలు సమీకరించింది. సంక్షేమ కార్యక్రమాల కోసం వేల కోట్లను ఖర్చు చేస్తన్నా మని ప్రభుత్వం చెబుతోంది.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రకారం..
రాష్ట్రాలు ఎంత మేరకు అప్పులు చేయాలనే విషయంలో ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం కీల కంగా పనిచేస్తుంది. ఈ చట్టం ప్రకారం రాష్ట్రా లు తమ ‘స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(జీఎస్‌డీపీ)లో సాధారణంగా 3 శాతం వరకు మా త్రమే ఏటా కొత్త రుణాలు తీసుకోవాలి. ప్రత్యేక పరిస్థితుల్లో, కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు అదనపు రుణ పరిమితిని కూడా అనుమతించ వచ్చు. తెలంగాణ ప్రభుత్వం తాము ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల పరిధిలోనే రుణాలు తీసుకుంటున్నామని చెబుతోంది.
అయితే ప్రతిపక్షాలు మాత్రం బడ్జెట్‌లో కనిపించే ప్రత్యక్ష అప్పులతో పాటు ప్రభుత్వ హామీలతో తీసుకున్న ఆఫ్-బడ్జెట్ రుణాలను కూ డా పరిగణనలోకి తీసుకోవాలంటోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో ఉండటం ఒక్కటే సరి పోదు..తీసుకున్న అప్పులను ఉత్పాదక పెట్టుబడులుగా మార్చడం, ఆదాయాన్ని పెంచే ప్రాజెక్టులకు వినియోగించడం, వడ్డీ భారా న్ని నియంత్రించడం కూడా అంతే కీలకమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
అప్పులతో మౌలిక సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు, ఉపాధి కల్పించే రంగా ల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఆదాయం పెరిగి రుణభారం తగ్గే అవకాశం ఉంటుంది. కానీ అదే రుణాలు ప్రధానంగా రెవెన్యూ వ్యయం, సబ్సిడీలు, తక్షణ అవసరాలకే పరిమితమైతే వడ్డీ భారం పెరిగి ఆర్థిక ఒత్తిడి అధికమవుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే అప్పు-జీఎస్‌డీపీ నిష్పత్తి, వడ్డీ చెల్లింపులభారం, రెవెన్యూలోటు, రాష్ట్ర ఆదా యవృద్ధి సూచికలను నిరంతరంపరిశీలిస్తూ ఆర్థికక్రమశిక్షణ పాటించాలంటున్నారు.
వడ్డీలకే వేల కోట్లు.. ప్రతి పౌరుడిపై రూ. లక్ష భారం
తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై ప్రస్తుతం అత్యధిక ఒత్తిడి తెస్తున్న అంశాల్లో అప్పులపై చెల్లించే వడ్డీ ప్రధానమైనది. ప్రభుత్వం ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయలను కేవలం వడ్డీ చెల్లింపులకే వెచ్చిస్తోంది. బడ్జెట్ అంచనాల ప్రకారం, ఇటీవల సంవత్సరాల్లో వడ్డీ చెల్లింపులకు రూ.20 వేల కోట్లకు పైగా, అసలు రుణాల చెల్లింపులకు మరో రూ.15-20 వేల కోట్ల వరకు కేటాయించాల్సి వస్తోంది. అంటే ప్రతి నెలా వేల కోట్ల రూపాయలు, సగటున ప్రతి రోజూ దాదాపు రూ.100 కోట్లకు పైగా పాత అప్పులు, వాటి వడ్డీల చెల్లింపులకే వెళ్తున్న పరిస్థితి ఏర్పడింది.
దీంతో ప్రభుత్వ ఆదాయంలో గణనీయమైన భాగం రుణాల సేవలకే ఖర్చవుతుండటంతో కొత్త అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలపై వ్యయం చేసే అవకాశాలు తగ్గుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యక్ష అప్పులు రూ.4.15 లక్షల కోట్లకు పైగా ఉన్నాయని బడ్జెట్ అంచనాలు సూచిస్తున్నాయి. రాష్ట్ర జనాభా సుమారు 4.2 కోట్లుగా పరిగణిస్తే, ప్రతి పౌరుడిపై సగటున దాదాపు రూ.1 లక్ష మేర రుణభారం ఉన్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
ప్రజలకు కావాల్సింది స్పష్టత
తెలంగాణ అప్పులపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నా... ప్రజలు మాత్రం రాజకీయ విమర్శలు కాదు, స్పష్టమైన లెక్కలు కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంపై ప్రస్తుతం ఉన్న ప్రత్యక్ష అప్పులు ఎంత? ప్రభుత్వ హామీలతో తీసుకున్న రుణాలు ఎంత? కార్పొరేషన్ల అప్పులు, పెండింగ్ బిల్లులు కలిపి మొత్తం ఆర్థిక భారం ఎంత? అనే అంశాలపై అధికారిక సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండాలని






