5 July, 2026 | 3:04 AM

రేవంతన్న 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

05-07-2026 01:28 AM

హైదరాబాద్, జూల్ ౪ (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి తాను హైదరాబాద్‌లో ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కళాశాల అయిన ఏవీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా విద్యార్థుల సమస్యల పై పోరాటం చేశారు. 1990లో కాలేజీ పూర్తయిన తర్వాత పెయింటర్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత తన అన్న సహకారంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగారు. 2006లో జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో టీడీపీ తరఫున కొడంగల్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లోనూ కొడంగల్ నుంచి టీడీపీ నుంచే గెలిచారు. 2014 నుంచి 2017 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్‌గా పని చేశారు. 2017 అక్టోబరులో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంటగా నియమితులయ్యారు.

2018 డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 మేలో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా విజయం సాధించారు.  2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 119 నియోజకవర్గాల్లో 64 స్థానాల్లో గెలిచింది. రేవంత్‌రెడ్డి కొడంగల్ నుంచి గెలిచి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.