5 July, 2026 | 2:35 AM

2028లో శాసనసభ, శాసనమండలి బీసీలదే

05-07-2026 12:58 AM
  1. రేవంత్‌రెడ్డిని తప్పించి బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి
  2. నేడు భువనగిరిలో చారిత్రాత్మక బీసీ రాజ్యాధికార సమరభేరి సభ
  3. టీఆర్పీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జూలై ౪ (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీలందరినీ ఏకం చేస్తూ ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని భువనగిరి బస్‌స్టాండ్ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో చారిత్రాత్మక బీసీ రాజ్యాధికార సమరభేరి సభను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రకటించారు.

అమరుడైన గద్దరన్న అమ్మ తెలంగాణమా పాటను తొలిసారిగా పాడిన స్థలం, అలాగే బెల్లి లలితక్క తెలంగా ణ జనసభను ప్రారంభించిన చారిత్రాత్మక స్థలం ఇదే కావడంతో ఈ వేదికను ఎంచుకున్నట్లు మల్లన్న తెలిపారు. జయశంకర్ సార్, కొండా లక్ష్మణ్ బాపూజీ, మారోజు వీరన్న లాంటి వారు ఉద్యమాలు నిర్మించిన ఈ వేదిక నుంచే బీసీల రాజ్యాధికారం కోసం కొత్త ఉద్యమానికి నాంది పలకబోతున్నట్లు పేర్కొన్నారు. సంపద, అధికారం, ఉద్యోగాలలో జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలన్నదే ఈ సభ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మల్లన్న విమర్శించారు.

బీసీ సబ్ ప్లాన్ అమలు, 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో సీఎం రేవంత్ రెడ్డి బీసీల ను మోసం చేశారని ఆరోపించారు. కర్ణాటక రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని తీసేసి ఓసీకి ఆ పదవి ఇచ్చినందుకు బదులుగా, తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డిని తొలగించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (బీసీ)కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ప్రభుత్వం చేసిన సమగ్ర కులగణన ప్రకారం ఈడబ్ల్యూఎస్ కోటాకు తెలంగాణలో కేవలం 5% లోపు మాత్రమే అర్హులు ఉన్నారని, కానీ వారికి 10% రిజర్వేషన్లు ఇస్తున్నారని మల్లన్న మండిపడ్డారు.

అదే సమయంలో 60% జనాభా ఉన్న బీసీలకు మాత్రం కేవలం 27% మాత్రమే ఇస్తున్నారని ఆయన తమిళనాడు తరహాలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తెలంగాణలో పూర్తిగా రద్దు చేయాలని, రేపు బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని కంప్లీట్‌గా రద్దు చేసి నిరుద్యోగులకు వయోపరిమితి (ఏజ్ రిలాక్సేషన్) సడలింపు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. 

అప్పుల పేరిట బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాటకాలు

రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజల ముందుకు దొంగ నాటకాలు ఆడుతూ కాలయాపన చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల తలకాయలు తాకట్టు పెట్టి తెచ్చిన లక్షల కోట్ల అప్పులకు ఈ రెండు పార్టీలే బాధ్యత వహించాలని, వాటికి ఆ రెండు పార్టీలే స్వయంగా జమానత్ (గ్యారంటీ) రాసి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశా రు. తనపై వస్తున్న విమర్శలకు భయపడి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేద ని, 2028 నాటికి అటు శాసనమండలితో పాటు ఇటు శాసనసభను కూడా కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులను కులగణన లెక్కలతో సహా ఆధారాలతో బయటపెట్టినందుకే తనను కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేశారని,

దాని కి తాను ఏమాత్రం బాధపడటం లేదన్నారు. ఈ సభ ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర చేపట్టనున్నట్లు, ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సరికొత్త ధూమ్-ధామ్ తరహా లో జరిగే ఈ కార్యక్రమం కేవలం ఒక రాజకీ య సభ కాదని, ప్రొఫెసర్లు చేసిన రీసెర్చ్ పేప ర్లు, భయంకరమైన లెక్కలతో కూడిన ఒక బ్రహ్మాండమైన క్లాస్ అని మల్లన్న తెలిపారు.