హెచ్‌ఐవి ఇంజక్షన్ ఇచ్చాడని మనస్థాపంతో యువతి ఆత్మహత్య
ఘట్ కేసర్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): హెచ్‌ఐవి ఇంజక్షన్ ఇవ్వడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు కుంది. ఒక యువతి ప్రాణం తీయడానికి నిందితుడు ఎంచుకున్న మార్గం వింటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి విఫలం కావడంతో ఆ యువతికి కక్షతో బలవంతంగా తనకు సోకిన హెచ్‌ఐవి రక్తాన్ని ఇంజక్షన్ ద్వారా ఇచ్చాడు.
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం గత నెలలో మనోహర్ అనే వ్యక్తి యువతికి బలవంతంగా హెచ్‌ఐవి ఇంజక్షన్ ఇచ్చాడు. తనకు ప్రాణాంతక వ్యాధిని అంటించాడన్న బాధతో సమాజంలో ఎలా బతకాలన్న ఆవేదనతో యువతి గత కొన్ని రోజులుగా తీవ్ర మనోవేదనకు గురైంది. చివరకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. మనస్థాపం చెంది ఆత్మహత్య పాల్పడుతున్నట్లు మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లో పేర్కొందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మనోహర్ అరెస్టు అయి రిమాండ్ లో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.




