ప్రేమలో మోసపోయి యువతి ఆత్మహత్యయత్నం
పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రేమలో మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… నిఖిత(24) అనే యువతి జుర్రు మహేష్(27) అనే యువకుడిని ప్రేమించింది. అయితే అతడు మరో యువతిని వివాహం చేసుకుని ఎక్కడికో వెళ్లిపోయినట్లు మహేష్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విషయంలో న్యాయం కోసం నిఖిత కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినప్పటికీ, నెల రోజులు గడిచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర మనస్తాపానికి గురైన నిఖిత, శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిఖిత, “నాకు అతనే కావాలి” అంటూ భావోద్వేగానికి లోనైంది. తనను ప్రేమించిన యువకుడి కుటుంబ సభ్యులే తమ మధ్య దూరం కల్పించారని ఆరోపించింది. అతను తనను ఎంతో ప్రేమించేవాడని, అతడిని కుటుంబ సభ్యులు దాచిపెట్టారని తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకుని యువతికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




