మద్యం మత్తులో యువకుడి వీరంగం
బూర్గంపాడు, జూలై 30(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్‌రోడ్‌లో ఆర్టీసీ బస్సుపై మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు రాళ్లు విసరడంతో కలకలం రేగింది. విజయవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై అకస్మాత్తుగా రాళ్లు విసరడంతో ముందు భాగంలోని పక్క అద్దాలు ధ్వంసమయ్యాయి.అద్దాలను ఛేదించిన రాళ్లు బస్సులోకి దూసుకురావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ఘటనలో కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాల య్యాయి. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును సురక్షితంగా నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రాళ్లు విసిరిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






