పాత గొడవలతో యువకుడి దారుణ హత్య
-గ్రౌండ్‌కు పిలిపించి మూకుమ్మడి దాడి..
-ఆస్పత్రికి తరలించేలోపే మృతి
-ఎంకే గ్యాంగ్‌పై కుటుంబ సభ్యుల ఆరోపణలు..
-కేసు నమోదు చేసిన పోలీసులు
-మణుగూరు లో కలకలం
మణుగూరు,(విజయ క్రాంతి): మణుగూరులో పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడిపై మూకుమ్మడి దాడి చేసి హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీ బొమ్మ సెంటర్ కు చెందిన సింహాద్రి శివకుమార్ అలియాస్ శివ (28) ఈ ఘటనలో మృతి చెందాడు. గురువారం ఉదయం మణుగూరు పాత ఏరియా స్టోర్స్ వద్ద నున్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్‌కు పిలిపించి పలువురు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపినవివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఇంటీరియర్ పనులు చేసుకుంటున్న శివ వద్ద పనిచేసే సతీష్‌తో గతంలో జరిగిన వివాదాన్ని మనసులో పెట్టుకున్న ఎంకే గ్యాంగ్ లీడర్ రమాకాంత్ అలియాస్ రమ్మీ అలియాస్ జెట్టి, అతని అనుచరులు శివను మణుగూరుకు వస్తే చంపేస్తామని ఫోన్‌లో బెదిరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చిన శివకు రమాకాంత్ ఫోన్ చేసి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గ్రౌండ్‌కు రావాలని చెప్పినట్లు సమాచారం. శివ తన ఇంటి సమీపంలోని ఉదయ్‌కుమార్‌తో కలిసి నేతాజీ గ్రౌండ్‌కు వెళ్లగా అక్కడ ముందుగా వేచి ఉన్న రమాకాంత్ అలియాస్ జెట్టి, భరత్, సాధిక్, వినయ్, ధినేష్, జంపయ్య, ప్రసాద్ తదితరులు మూకుమ్మడిగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. శివను కాపాడేందుకు ప్రయత్నించిన ఉదయ్‌కుమార్‌పై కూడా దాడి చేసినట్లు తెలిపారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కొడుకు మృతి విషయం తెలియగానే తల్లి స్పృహ కోల్పోగా ఆస్పత్రిలో చికిత్సలు అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దాడికి దారితీసిన కారణాలు, ఘటనలో పాల్గొన్న వారి పాత్ర, ముందస్తు ప్రణాళిక తదితర అంశాలపై విచారణ కొనసాగుతోంది. మణుగూరు డిఎస్పీ రవీంధర్ రెడ్డి, సిఐ పాటి నాగబాబులు ఘటన ప్రాంతాన్ని సందర్శించి దర్యాప్తు చేస్తున్నారు.






