ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని విజయవంతం చేయండి
ఇల్లెందు,(విజయక్రాంతి): ఆగస్టు 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని తుదిడెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈసం నరసింహరావు పిలుపునిచ్చారు. సోమవారం ఇల్లెందులో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరెంట్ ఆఫీస్ సెంటర్‌లో ఆదివాసి జెండాను ఆవిష్కరించిన అనంతరం అక్కడి నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివాసి గ్రామంలో జెండాలు ఎగురవేసి దినోత్సవాన్ని పండుగలా నిర్వహించాలని కోరారు.
ప్రపంచవ్యాప్తంగా వేలాది ఆదివాసి తెగలు తమ భాష, సంస్కృతి, సంప్రదాయాలు, హక్కుల పరిరక్షణ కోసం ఆగస్టు 9ను ప్రపంచ ఆదివాసి దినోత్సవంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి 1994లో చేసిన తీర్మానం మేరకు ఈ దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని ఆదివాసి తెగలు తమ సంస్కృతి, కళారూపాలను పరిరక్షించుకుంటూ ఈ వేడుకలను నిర్వహిస్తున్నారని, అయితే ప్రభుత్వాల విధానాల వల్ల ఐదో షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసులకు నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గొగ్గల రామస్వామి, జార కృష్ణ, మండల నాయకులు పొడుగు రాంబాబు, సువర్ణపాక హనుమంతరావు, పూనం కోటయ్య పాల్గొన్నారు.






