4 August, 2026 | 8:28 PM

టైగర్ జోన్ రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

03-08-2026 05:52 PM

- నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్

జన్నారం,(విజయక్రాంతి): కవ్వాల్ టైగర్ జోన్ రద్దు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే చర్యలు ప్రారంభించాలని నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితీష్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మా బొజ్జు పటేల్ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే 'టైగర్ జోన్ వద్దు' అని తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినట్లయితే, దానిని కేంద్రం వద్ద ఆమోదింపజేయడానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.

తమ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టైగర్ జోన్‌ను రద్దు చేయించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా ఇకపై ఆలస్యం చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. నడుస్తున్న ఈ శాసనసభ సమావేశాల్లోనే తీర్మానం ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్‌తో పాటు రాష్ట్ర అటవీశాఖ మంత్రి, ముఖ్యమంత్రిని ఆయన డిమాండ్ చేశారు.