3 August, 2026 | 7:31 PM

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విభాగాల ప్రగతి నివేదికలు తప్పనిసరి

03-08-2026 06:20 PM

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి,(విజయ క్రాంతి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను ఈ నెల 7వ తేదీ నాటికి సమర్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖలు సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలపై పూర్తి వివరాలతో నివేదికలను ఆగస్టు 7లోగా జిల్లా ప్రజాసంబంధాల అధికారికి అందజేయాలని సూచించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను వైభవంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. పారిశుధ్యం, అలంకరణ, భద్రత, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రోటోకాల్ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డిఆర్ఓ వసంత కుమారి, ఆర్డిఓ హరికృష్ణ, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.