4 August, 2026 | 8:27 PM

తల్లిపాలే బిడ్డకు మొదటి టీకా: కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్

03-08-2026 06:09 PM

ఇల్లెందు,(విజయక్రాంతి): పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక, శారీరక ఎదుగుదలకు తల్లిపాలే అత్యంత శ్రేయస్కరమని 22వ వార్డు కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం ఇల్లెందు పట్టణంలోని వినోబాభావే కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పుట్టిన గంటలోపే శిశువుకు ముర్రుపాలు ఇవ్వాలని, అందులోని రోగనిరోధక శక్తి బిడ్డకు రక్షణ కవచంలా పనిచేస్తుందని తెలిపారు.

ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం రెండేళ్ల వరకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న బాలామృతం, చిక్కీలు పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడతాయని, గర్భిణులు, బాలింతల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మూడు నుంచి ఐదు సంవత్సరాల పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ కొర్లపాటి శివకిరణ్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు.