12 July, 2026 | 2:24 AM

ఇత్తడి పరిశ్రమతో ప్రపంచ ఖ్యాతి

12-07-2026 12:00 AM

పెంబర్తి జనగాం జిల్లాలోని హైదరాబాద్‌కు సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక గ్రామం. కాకతీయ రాజవంశం కాలంలో విలసిల్లిన ఒక ప్రాచీన కళ అయిన, 800 సంవత్సరాల నాటి ఇత్తడి, రేకు లోహ కళాకృతులకు ఇది అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది.

జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామం ఇత్తడి పరిశ్రమకు ప్రపంచ ప్రఖ్యాతిపొందింది. ఊరిలో సగభాగం ఈ పరిశ్రమలో పాల్గొనే పారిశ్రామికులు, వ్యాపారులున్నారు. చారిత్రకంగా పిరియపెంబర్తిగా శాసనాల్లో పేర్కొనబడిన పెంబర్తి ఒకప్పుడు కళ్యాణి చాళుక్యుల పాలనలో వుండేది. యాదాద్రి జిల్లా కొలనుపాకలో పారమార జగద్దేవుని పేరన అతని ప్రధాని, శాంతిభద్రతల పరిరక్షకుడైన సోమల నాయకుడు జగద్దేవనారాయణాలయం నిర్మింపజేసాడు.

దానికి అంగరంగభోగాలకు, బ్రాహ్మణులకు, విద్యార్థులకు గాను పెంబర్తిని దానమిచ్చినట్లు శాసనం వేయబడ్డది. పెంబర్తిలో అప్పేశ్వరాలయమున్నదని మరొక శాసనం లో చెప్పబడింది. అదే ఇప్పటి చండికాంబ శివాలయమేమో. పెంబర్తి గ్రామం చుట్టూ కోటగోడ ద్వారాలుండేవనడానికి నిదర్శనంగా ఇప్పటికీ గ్రామంలో చావిళ్లతో ద్వారం కనపడుతుంది. గ్రామంలో 3చోట్ల బురుజుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శివాలయం పక్కసందులో కొంచెం వెనకగా మమ్మాయిగుడి వుంది.

ఈ గుడిని విశ్వబ్రాహ్మణులే నిర్వహిస్తున్నా రు. గుడిధ్వజస్తంభంమీద లఘుశాసనం వుంది. కానీ రంగువేయడం వల్ల దానిని చదువడం వీలుపడలేదు. అట్లే ఈ గుడిలోని హనుమంతుని ముందర రాతిగద ఇక్కడి విశేషం. ఈ గుడిలోని మమ్మాయిదేవి కొల్చారం, సిద్దిపేట, చేర్యాల, కొలనుపాక, కోనసముద్రంలలోని మమ్మాయిదేవి శిల్పాలకన్నా భిన్నంగా వుంది. శిల్పం కాకతీయ శైలిలో చెక్కబడిన ట్టు తెలుస్తున్నది. మమ్మాయి చతుర్భుజి.

వెనక కుడిచేతిలో ఢమరుకం, ఎడమచేతిలో చక్రం,ముందు కుడిచేతిలో అం కుశం, ఎడమచేతిలో ఫలం వున్నాయి. కుడికాలు నేలకాన్చివుంది. కాలుకింద 3 శిరస్సులున్నాయి. వాటికి కుడిపక్కన ఒంటె వాహనంగా వుంది. కోనసముద్రంలోని రెండు మమ్మా యి పీఠాల్లోను వాహనంగా ఒంటెలే వున్నాయి. లోహకారుల దేవతగా పూజింపబడుతున్న మమ్మాయిదేవి గుళ్ళు, శిల్పాలు అరుదుగా వుంటాయి. ఎక్కడ (ఇనుము)లోహ పరిశ్రమ వుంటుందో అక్కడ ఈ దేవత ఆరాధింపబడటం ప్రత్యేక సంస్కృతి.

ప్రత్యేకమైన బైరాగి మఠం

పెంబర్తిలో రాజపేట (యాదాద్రి జిల్లా)లో వలెనే బైరాగిమఠం వుంది. కానీ ప్రస్తుతం అది పూర్తిగా శిథిలమైంది. ధర్మకర్తలు హైదరాబాద్ జియాగూడలో ఉంటారని గ్రామస్థులు చెపుతారు. ఆ ప్రాంగణంలో  గొప్ప భవన శిథిలాలున్నాయి. బైరాగిమఠం (వేంకటేశ్వర) దేవాలయం మూసివుంది. చుట్టూ పెద్దప్రాకారం వుంది. మడులు, మాన్యాలు పోయి పాతకాలం ప్రాభవాలు పోయాయి. చరిత్ర మిగిలివుంది. గ్రామ నామాల ఉత్పత్తులు సాధించడంలో భాషను అధ్యయనం చేయాల్సిన అవసరం వుంది. పాములపర్తివంటిదే, పెంబర్తి అంటే పెనుపర్తి. చెన్ అంటే ఎరుపు, రాగి ఎరుపుగానే వుంటుంది కనుక చెన్+పర్తి= చెంపర్తి పెంబర్తి కాలేదు. కుర్తి, పర్తి అనేవి ప్రాచీన గ్రామాల పేర్లలో ఉన్నాయి.