రింగ్ ఫైట్‌కు గుర్తింపే లక్ష్యం!
మనిషి కలలు కనడం గొప్ప కాదు.. ఆ కలలు సమాజానికి ఉపయోగపడేలా చేయడం గొప్ప. అలాంటి అరుదైన క్రీడా గురువు నల్లగొండ జిల్లాకు చెందిన తాడెం రవికుమార్. భారతీయ మార్షల్ ఆర్ట్స్‌కు కొత్త గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో దశాబ్దకాలంగా నిరంతర పోరాటం చేస్తున్నారు. ఆయన రూపొందించిన ‘రింగ్ ఫైట్’ అనే భారతీయ ఫైటింగ్ క్రీడకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు సాధించడమే జీవిత ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.
మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాదు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, మానసిక దృఢత్వం, శారీరక సామర్థ్యాన్ని పెంపొందించే జీవన విధానం. చైనా, జపాన్, థాయ్‌లాండ్ వంటి దేశాలు మార్షల్ ఆర్ట్స్‌ను అభివృద్ధి సాధనంగా మార్చుకున్నప్పటికీ, భారత్‌లో మాత్రం ఈ రంగానికి తగిన ప్రోత్సాహం లభించడం లేదనే భావన క్రీడా నిపుణుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో భారతీయ సంప్రదాయ పోరాట క్రీడలకు కొత్త రూపం ఇవ్వాలనే సంకల్పంతో తాడెం రవికుమార్ 2012లో ‘రింగ్ ఫైట్’ను రూపొందించారు. 2016లో దీనిని అధికారికంగా నమోదు చేయించి, దేశవ్యాప్తంగా విస్తరించేందుకు తన ప్రయత్నాలు ప్రారంభించారు.
మార్టల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం
ఎం.ఏ. (హిస్టరీ) చదివిన రవికుమార్, నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో జూడో శిక్షణ పొంది 2007లో బ్లాక్‌బెల్ట్ సాధించారు. జూడోతో పాటు కరాటే, కిక్ బాక్సింగ్, మువ్ థాయ్, థాంగ్-తా, ఇతర మార్షల్ ఆర్ట్స్‌ల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. రింగ్ ఫైట్‌కు గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది జాతీయ స్థాయి ఛాంపియన్‌షిప్‌లు నిర్వహించారు. ప్రస్తుతం ఈ క్రీడ దేశంలో 22 రాష్ట్రాలకు విస్తరించి, వేలాది మంది క్రీడాకారులను ఆకర్షిస్తోంది. 2019లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఓరియంటేషన్ కోర్సును పూర్తి చేసి, విద్యార్థుల్లో ఈ క్రీడను విస్తరించే ప్రయత్నాలు ప్రారంభించారు.
ఆర్థిక ఇబ్బందులకు ఎదురొడ్డి..
తాడెం రవికుమార్ తల్లిదండ్రులు యాదమ్మ, జైహింద్. వీరిది వ్యవసాయ కుటుంబం. రవికుమార్‌కు వ్యక్తిగతంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, తల్లిదండ్రుల నుంచి వచ్చిన కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.అదే సమయంలో నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అనేక మంది విద్యార్థులకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ శిక్షణ అందిస్తున్నారు. ఆయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించగా, కొందరు తెలుగు సినీ పరిశ్రమలో ఫైట్ మాస్టర్లుగా, స్టంట్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు.
గుర్తింపు కోసం దరఖాస్తు
‘రింగ్ ఫైట్’కు గుర్తింపునకు 2024 ఏప్రిల్ 29న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు జాతీయ క్రీడా సమాఖకు దరఖాస్తు సమర్పించారు. అదే విధంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, నివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా వంటి సంస్థలకు కూడా ప్రతిపాదనలు పంపించారు. త్వరలో అంతర్జాతీయ స్థాయి పోటీ నిర్వహించి రింగ్ ఫైట్‌ను ప్రపంచ వేదికపై నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
యువతలో అపారమైన ప్రతిభ: రవికుమార్
‘రింగ్ ఫైట్‌కు ప్రభుత్వం గుర్తింపు ఇచ్చి, తగిన ప్రోత్సా హం అందిస్తే పదేళ్లలో ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం ఉంది. భారత యువతలో అపారమైన ప్రతిభ ఉంది. అవకాశాలు కల్పిస్తే ప్రపంచస్థాయిలో రాణిస్తారు’ అని తాడెం రవికుమార్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం లభిస్తే, రాబోయే మూడేళ్లలో ఈ క్రీడను మరింత అభివృద్ధి చేసి, ఒలింపిక్ స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్రీడా రంగం లో సేవలు అందిస్తూ యువతను శారీరకంగా, మానసికంగా బలోపేతం చేయడం, దేశానికి ప్రతిష్ట తీసుకురావడం తన ప్రధాన లక్ష్యం అంటున్నారు. మరోవైపు క్రీడా రంగంలో జీవితాన్ని అంకితం చేసిన ఇలాంటి శిక్షకులకు ప్రభుత్వాలు తగిన ప్రోత్సా హం అందిస్తే, గ్రామీణ ప్రాంతాల యువతలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చి దేశానికి మరిన్ని అంతర్జాతీ య పతకాలు అందించే అవకాశముందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాసకర్త: 9553041549






