5 June, 2026 | 3:47 PM

కేఓసీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం

05-06-2026 02:46 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఆదేశాల మేరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలను ఇల్లందు ఏరియాలోని కోయగూడెం ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్ (కేఓసీ)లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యకమానికి కే.ఓ.సి మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జనరల్ మేనేజర్ కృష్ణయ్య హాజరైనారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా కే.ఓ.సి  అధికారులు, ఉద్యోగులు మరియు కాంట్రాక్టు ఉద్యోగులు అందరు కలిసి రక్షణ ప్రతిజ్ఞ, పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ఏక్ పేడ్ మా కే నామ్” అనే నినాదంతో సింగరేణి వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. మనచుట్టూ వున్న పర్యావరణాన్ని కాపాడటంలో మనవంతుగా పరిసరాలతో పాటు మన మనసులను శుద్ధి చేసుకోవాలని అలాగే ప్రతిమనిషి ఒక్కనిముషం ప్రకృతిని కాపాడటం కోసం మనవంతుగా కృషి చేయాలనీ మనము పీల్చే గాలి స్వచ్చంగా ఉండేలా చుసుకోవాలని అందుకై చెట్లను విరివిగా నాటి వాటిని పరిరక్షించు కోవాలని అన్నారు. ముఖ్యంగా మనం నిత్యం వాడే వస్తువులలో ఫ్లాస్టిక్ ని సాద్యమైనంతగా దూరంగా ఉంచాలన్నారు. పర్యావరణ రహిత సమాజాన్ని రాబోయే తరానికి అందించడానికి అందరు కృషి చేయాలనీ అన్నారు. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ గనులు మరియు విభాగల అధిపతులు ఇతర అధికారులు కలిసి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని కోరారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడం, పెట్రోల్–డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని తెలిపారు. అలాగే సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనుల తవ్వకాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో తిరిగి పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని దట్టమైన అడవులుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రకృతి పరిరక్షణ, హరితాభివృద్ధి, కార్బన్ ఉద్గారాల తగ్గింపులో సింగరేణి సంస్థ విశేష కృషి చేస్తోందని పేర్కొన్నారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్ 7న కోయగూడెం ఓ.సి. ఉద్యోగులకు పర్యావరణ అంశాలపై వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ సతీష్ కుమార్, కేఓసీ పర్యావరణ అధికారి నరసింహారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎల్. అశోక్, గుర్తింపు సంఘం నుంచి బి.బాలాజీ, హరి సింగ్  ప్రాతినిధ్యసంఘం నుంచి బి.నాగేశ్వర రావు, సత్యనారాయణ, అధికారులు, ఉద్యోగులు మరియు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.