మా సమస్యల పరిష్కరానికి కృషి చేయండి
- కరెంట్ మీటర్ రీటింగ్ ఔట్‌సోర్సింగ్ కార్మికులు
- ఎమ్మెల్సీ మల్లన్నను కలిసి వినతిపత్రం అందజేత
హైదరాబాద్, మార్చి౧(విజయక్రాంతి): రాష్ట్రంలోని కరెంట్ మీటర్ రీడింగ్ ఔట్‌సోర్సింగ్ కార్మికు లు ఆదివారం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం సమర్పించారు. గత అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనాలు, ఉద్యోగ భద్రత లేకపోవడం, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ వంటి సంక్షేమ సౌకర్యాలు పూర్తిగా అమలు కాకపోవడం, పనిభారం అధికంగా ఉండటం వంటి సమస్యలను వారు మల్లన్నదృష్టికి తీసుకువచ్చారు.
కార్మికులు మాట్లాడుతూ తాము 10-15 సంవత్సరా లుగా పనిచేస్తున్నప్పటికీ స్థిరీకరణ జరగలేదని, నెలకు కేవలం రూ.4,000-7,000 మధ్య మాత్ర మే వేతనం అందుతుందన్నారు. అదీ సమయానికి చెల్లించకపోవడం వల్ల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అదనంగా అనవసరమైన కాల్స్, టార్గెట్లు, ఒత్తిళ్లు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని పేర్కొన్నారు.
చాలా మంది కార్మికులకు ఈఎస్ ఐ, ఈపీఎఫ్ అమలు సక్రమంగా జరగడం లేదని కూడా వినతిపత్రంలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఔట్‌సోర్సింగ్ కార్మికుల సమస్యలు చాలా కాలంగా పెండిం గ్‌లో ఉన్నాయన్నారు.ప్రభుత్వం,సంబంధిత విభాగాలతో మాట్లాడి రెండు నెలల లోపు స్పష్టమైన పరి ష్కారం వచ్చేలా చేసే బాధ్యత నాది అని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.
కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యో గ భద్రత, ఈఎస్‌ఐ,- ఈపీఎఫ్ వంటి హక్కులు తప్పనిసరిగా అందాలని ఆయన స్పష్టం చేశారు. పనిచేసే వారికి గౌరవం, కష్టానికి సరైన ప్రతిఫలం రావాలి. కార్మికుల హక్కుల కోసం శాసన మండలి వేదికగా కూడా పోరాడతాం అని మల్లన్న పేర్కొన్నారు. రెండు నెలల గడువులో సమస్యలపై పురోగతి లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని కూడా హెచ్చరించారు.
కార్మికులు తమ సమస్యలను వినిపించి వెంటనే స్పందించినందుకు ఎమ్మెల్సీ మల్లన్నకి కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.అలాగే రేపు ఇందిరా పార్క్ దగ్గర జరగబోయే ధర్నా కార్యక్రమంలో కూడా పాల్గొననున్నట్లు కార్మికులు పేర్కొన్నారు.




