1 March, 2026 | 3:17 PM

రియల్ ప్లేయర్స్‌తో మహిళా కబడ్డీ

01-03-2026 12:27 AM

టాలీవుడ్‌లో ఇప్పుడు రియల్ కబడ్డీ క్రీడాకారులతో ఓ సినిమా రూపొందుతోంది. అదే ‘మహిళా కబడ్డీ’. ఆర్కే ఫిలింస్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరో సుమన్, అక్సాఖాన్, ఆమని, ఇంద్రజ, తులసి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రంలో ఇండియన్ వుమెన్స్ కబడ్డీ టీమ్ వైస్ కెప్టెన్ పూజ నర్వాల్, ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డితోపాటు ఏడుగురు రియల్ కబడ్డీ ప్లేయర్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో మేకర్స్ ఈ సినిమా వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కోచ్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. “నేను మన టీమ్‌కు కోచ్‌గా ఉన్నా. ప్రో కబడ్డీ లీగ్‌కు కోచ్‌గా పనిచేశా. ‘మహిళా కబడ్డీ’లో నటించటం ఆనందంగా ఉంది” అని తెలిపారు.

పూజ నర్వాల్ మాట్లాడుతూ.. “కబడ్డీని ప్రొఫెషనల్‌గా ఎంచుకునే అమ్మాయిలకు మంచి భవిష్యత్ ఉంటుంది. మహిళలకు ప్రో కబడ్డీ లీగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇలాంటి టైమ్‌లో ‘మహిళా కబడ్డీ’ సినిమాను రూపొందిస్తుండటం సంతోషంగా ఉంది” అని చెప్పారు. రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. “పల్లెటూరి నుంచి వచ్చిన ఒక పేద అమ్మాయి కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది, ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం.

తెలుగు, హిందీ భాషల్లో రూపొందించే ఈ సినిమాలో అక్సాఖాన్‌తో మరో హీరో, హీరోయిన్‌నూ ఎంపిక చేశాం. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యింది. సాంగ్స్ రికార్డింగ్ చేశాం. సంగీత దర్శకుడిగా రాజ్‌కిరణ్, డీవోపీగా ప్రకాశ్, ఎడిటర్‌గా మేనగ శ్రీను పనిచేస్తున్నారు. త్వరలోనే మా చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్తాం” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటుడు సుమన్, నటీమణులు అక్సాఖాన్, తులసి, కబడ్డీ ప్లేయర్ రాధిక రెడ్డి కూడా మాట్లాడారు.