4 May, 2026 | 1:45 AM

బతుకులు బుగ్గి

04-05-2026 12:25 AM

ఢిల్లీలో అగ్నిప్రమాదం

తొమ్మిది మంది సజీవదహనం

  1. ఏసీ పేలుడు, షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం?
  2. దర్యాప్తు చేస్తున్న అధికారులు
  3. సీఎం రేఖాగుప్తా దిగ్భ్రాంతి

న్యూ ఢిల్లీ, మే 3: దేశ రాజధాని ఢిల్లీలోని షాదారా, వివేక్ విహార్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో ఆదివారం వేకువజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకటిన్నర సంవత్సరాల చిన్నారితో సహా 9మంది సజీవదహనమయ్యారు. గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ అగ్నిమాపకశాఖ అధికారి ముఖేష్ వర్మ మాట్లా డుతూ.. ఆదివారం తెల్లవారుజామున 3.47 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదానికి సం బంధించిన సమాచారం అందిందన్నారు.

వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నామని, నాలుగు గంటలపాటు 14 అగ్నిమాపక యంత్రాల సహాయంతో శ్రమించిన తరువాత ఉదయం 8 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయన్నారు. భవనంలో చిక్కుకున్న 15 మందిని రక్షించామని తెలిపారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయ న్నారు. 9 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాగా ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని కొందరు చెబుతుండగా, ఏసీ యూనిట్ పేలడంతోనే ప్రమాదం జరిగిందని స్థానిక కౌన్సిలర్ పంకజ్ లుత్రా మీడియాకు తెలిపారు.

ఖచ్చితమైన కారణాన్ని అధికారులు ధృవీకరించ లేదు. ఢిల్లీ పోలీస్ క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెండో అంతస్తులో మంటలు చెలరేగడం, అందరూ గాఢ నిద్రలో ఉండడంతో పై అంతస్తులకు మంటలు వ్యాపించి ప్రాణనష్టం జరిగిందని స్థానికులు తెలిపారు.

మృతి చెందిన వారు అరవింద్ జైన్ (60), అతని భార్య అనితా జైన్ (58), కుమారుడు నిశాంత్ జైన్ (35), కోడలు అంచల్ జైన్ (33), ఒకటిన్నర సంవత్సరాల మనవడు ఆకాష్ జైన్, మూడో అంతస్తులో నితిన్ జైన్ (50), అతని భార్య షైలీ జైన్ (48), కుమారుడు సమ్యక్ జైన్ (25)లుగా గుర్తించారు.

మొదటి అంతస్తులో శిఖాజైన్ (45) మృతదేహం లభ్యం కాగా, ఆమె భర్త నవీన్ జైన్ (48) తీవ్రంగా గాయపడ్డాడు. ఈ భవనంలో ప్రతి అంతస్తులో 4 బీహెచ్‌కె రెండు ఫ్లాట్లు ఉన్నాయని, ఆరు ఫ్లాట్లలోని సామాగ్రి పూర్తిగా దగ్ధమైందని, బాల్కనీ, కిటికీలు, ఇనుప గ్రిల్స్‌తో ఉండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందని ముఖేష్ వర్మ తెలిపారు. 

సీఎం రేఖాగుప్తా దిగ్భ్రాంతి

ఈ ప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘వివేక్ విహార్ ప్రమాదం అత్యంత విషాదకరమని, 9 మంది ప్రాణాలు కోల్పోవడం  తీవ్రంగా కలచివేసిందన్నారు. బాధితులకు ఢిల్లీ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎక్స్ వేదికగా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను రేఖా గుప్తా ఆదే శించారు.

2 లక్షల చొప్పున పరిహారం: ప్రధాని మోదీ

అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమా దంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారిని ఆదుకునేందుకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి సాయం అందిస్తామని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు.