4 May, 2026 | 1:17 AM

ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేడే

04-05-2026 12:10 AM
  1. తేలనున్న పార్టీల భవితవ్యం
  2. మధ్యాహ్నం వరకు పూర్తి ఫలితాలు
  3. సాయంత్రానికి జయాపజయాల ప్రకటన
  4. జాతీయ రాజకీయాలపై తమిళనాడు, పశ్చిమ బంగాల్ ఫలితాల ప్రభావం
  5. దేశవ్యాప్తంగా భారీ బెట్టింగ్‌లకు సిద్ధం?

న్యూ ఢిల్లీ, మే 3: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉత్కంఠకు తెరవీడనుంది. పశ్చిమ బంగాల్, తమి ళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం (మే 4)న జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభించనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కించనున్నారు. మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. సాయంత్రానికి గెలుపోటములను ప్రకటించనున్నారు.

దీంతో హేమాహేమీలైన మమతా బెనర్జీ, స్టాలిన్, విజయన్‌ల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈసారి భారీ పోలింగ్ నమోదైనందున ఎగ్జిట్ పోల్స్ మిశ్ర మ ఫలితాలను అందించడంతో ఎవరు గెలుస్తారో అనే ఉత్కంఠ కొనసాగుతున్నది. తమిళనాడు, పశ్చిమ బంగాల్ ఫలితాల ప్రభా వం జాతీయ రాజకీయాలపై ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరోవైపు ఫలితాలపై దేశవ్యాప్తంగా భారీ బెట్టింగ్‌ల జోరు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఫల్తాలో 21న రీ పోలింగ్

పశ్చిమ బెంగాల్‌లోని ఫల్తాలో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యం లో మే 21న రీపోలింగ్ నిర్వహించనున్నట్లు, మే 24న లెక్కింపు చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నియోజకవర్గానికి సంబంధించి సీఈసీకి భారీ ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ఈసీ  నియోజకవర్గంలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఫల్తాలో ఉన్న మొత్తం 285 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ కొనసాగుతుందని ప్రకటించింది.

ఈ ప్రాంతంలో టీఎంసీ అభ్యర్థి జహంగీర్‌ఖాన్‌కు సన్నిహితుడైన పంచాయత్ ప్రధాన్ ఇస్రాఫిల్ ఎన్నిక ల ఫలితాల తరువాత ఓట్లువేయని వారికి బుద్ధిచెబుతామని, వారి అంతుచూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తు స్థానికులు భారీ నిరసనలకు దిగారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దేబాంగ్‌షూ పోటీలో ఉన్నారు.

మరో నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నా, ప్రధానపోటీ ఈ ఇద్దరి మధ్యనే అనే వాదనలు వినిపిస్తున్నాయి. బెదిరింపులకు భయపడొద్ద ని నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఈసీ ప్రకటించింది. ఫలితాల అనంతరం అవసరమైతే బలగాలను మరింత సమయం ఇక్కడే విధుల్లో ఉంచుతామని కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.