4 May, 2026 | 1:57 AM

అక్రమాల గని!

04-05-2026 12:37 AM
  1. క్రషర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు
  2. రెండుసార్లు కలెక్టరేట్లో ప్రజావాణిలో ఫిర్యాదు
  3. ప్రజాభిప్రాయ స్వీకరణలో వ్యతిరేకించిన రావల్ కోల్ గ్రామస్తులు
  4. అయినప్పటికీ క్రషర్ కు అనుమతి 

మేడ్చల్, మే 3(విజయ క్రాంతి): మేడ్చల్ జిల్లా రావలుకోల్ గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న క్రషర్ వివాదాస్పదమైంది. ఒకవైపు గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నప్పటికీ మరోవైపు పనులు కొనసాగిస్తున్నారు. క్రషర్ ఏర్పాటుకు అధికార పార్టీ నాయకుల అండదండలు, జిల్లా అధికారుల సహాయ సహకారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తులు వ్యతిరేకించినప్పటికీ క్రషర్ ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రజాభిప్రాయ సేకరణలో తాముర్ వ్యతిరేకిస్తే అంగీకరించినట్లు రాసుకొని సంతకాలు తీసుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. క్రషర్ ఏర్పాటు వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు.

అనుమతులు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. పర్యావరణానికి ముప్పు రావల్కోల్ శివారులో 111 సర్వే నంబర్లు క్రషర్ ఏర్పాటుకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని గ్రామస్తులు అంటున్నారు. గ్రామానికి దగ్గరలో ఉందని, క్రషర్ ఏర్పాటు చేసే ప్రాంతానికి దగ్గరలో ఇందిరమ్మ కాలనీ ఉందని తెలిపారు. క్రషర్ నుంచి వెలువడే దుమ్ము గ్రామంలోనికి వచ్చే అవకాశం ఉందని.

పేలుళ్ల వల్ల ఇల్లు దెబ్బతింటాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక ఈ ప్రాంతంలో సుమారు 1000 నెమళ్లు ఉన్నాయని తెలిపారు. రెసిడెన్షియల్ జోన్ కు దగ్గరలో క్వారీకి ఎలా అనుమతినిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని తెలిపారు. రావల్కోల్ శివారులో క్రషర్ లతో ఇబ్బందులు రావలకోలు శివారులో ఇప్పటికే ఉన్న క్రషర్లతో గ్రామస్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ క్రషర్లు నిబంధనలు పాటించడం లేదు. విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారు. బ్లాస్టింగ్ చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదు. గుంతలు లోతుగా తీయడం వల్ల ప్రమాదకరంగా తయారయ్యాయి. అనుమతులు తక్కువగా తీసుకుని ఎక్కువ తవ్వకాలు జరిపారు. అధికారుల కళ్ళకు కనిపిస్తున్నప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. అంతేగాక అధిక లోడుతో టిప్పర్లు వెళ్లడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయి.

టిప్పర్లలో పరిమితికి మించి కంకర తరలిస్తున్నారు. ఐదారు క్రషర్ల నుంచి ప్రతి రోజు వందల సంఖ్యలో టిప్పర్లు వెళ్తున్నాయి. టిప్పర్లు వేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. క్రషర్ అనుమతులు రద్దు చేసే వరకు పోరాడుతామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.