మహిళా ఆరోగ్యమే మహాభాగ్యం
ఆరోగ్యమే మహిళా శక్తికి ములాధారం! మహిళలు కుటుంబాన్ని, సమాజాన్ని పటిష్ఠంగా నిలబెట్టే శక్తి కలవారు. ప్రతి దశలోనూ బాలికలు, మహిళలకు కొన్ని ప్రత్యేకమైన అవసరాలు, అవకాశాలు ఉంటాయి. వాటిద్వారా వాళ్లు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సంవత్సరం థీమ్ గివ్ టూ గెయిన్ అంటే మనం ఇస్తేనే పొందగలం మహిళల ఆరోగ్యానికి శ్రద్ధ పెడితే కుటుంబానికి ఆరోగ్యం లభిస్తుందని డా. వసుంధర చీపురుపల్లి (సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, రోబోటిక్ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్, కాస్మోటిక్ గైనకాలజిస్ట్ అండ్ ప్రసూతి వైద్యురాలు, కిమ్స్ కడల్స్, సికింద్రాబాద్) చెపుతున్నారు.
నిత్యం ఎన్నో పనులతో సతమతమవుతూ... తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మహిళలు. అలాగే ఐటి రంగాల్లో పని చేస్తే స్త్రీలు కూడా తమ ఆరోగ్యానికి తక్కువ సమయం కేటాయిస్తున్నారు. మారుతున్న జీవనశైలిలో ఆహారపు అలవాట్లు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ తినడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి.
మహిళల్లో ప్రధానంగా పిల్లలు లేకపోవడం, రుతుక్రమం సరిగా రాకపోవడం, గర్భశాయ సమస్యలు, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, నడవలేకపోవడం, ఒళ్లు నొప్పులు వంటివి ప్రధానంగా నేటి మహిళలు ఎదుర్కొంటున్నారు.
బాల్యం
అన్నిరకాల టీకాలు వేయించడంతో పాటు, రూబెల్లా వ్యాక్సిన్ కూడా అందేలా చూడాలి అంతే కాకుండా హెచ్‌పివి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల సర్వెకల్ క్యాన్సర్‌ని నివారించవచ్చు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ వ్యాక్సిన్లను ఉచితంగా సరఫరా చేస్తోంది. గర్భధారణ ప్రారంభంలో ఒక మహిళ రుబెల్లా బారిన పడితే, అది పుట్టిన శిశువులో తీవ్రమైన లోపాలకు దారితీస్తుంది.
పిల్లల్లో ఊబకాయం యుక్తవయస్సులో సమస్యలకు దారితీస్తుంది, ముఖ్యంగా పీసీఓఎస్ ఉన్న బాలికలకు యుక్తవయసులో మరిన్ని అనారోగ్యాలతో పాటు పెద్దవయసులో వైకల్యాలు వస్తాయి. తల్లిదండ్రులు టెన్నిస్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి క్రీడలు, లేదా ఇతర పిల్లలతో ఆరుబయట ఆడించడం, ఇలా ఏ రూపంలోనైనా వ్యాయామాన్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం. పాఠశాలల్లోనే రోజూ గంటపాటు ఫిజికల్ ఫిట్ నెస్ ఉండేలా చూడాలి.
యుక్తవయస్సు
యుక్తవయస్సులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది అవగాహన, జ్ఞానం, ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది. బాలికల రుతుక్రమ ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం వల్ల రక్తహీనతను నివారించడంపై కూడా దృష్టి పెట్టాలి.
కౌమార దశ
నేటి ప్రపంచంలో మహిళల పునరుత్పత్తి, లైంగిక ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. కౌమారదశలో ఉన్నవారు ఆసక్తిగా ఉన్నప్పుడు, వారి హార్మోన్లు పెరుగుతున్నప్పుడు ఇంటర్నెట్ లో పుష్కలంగా సమాచారం అందుబాటులో ఉంది, కానీ అదంతా సరైన సమాచారం కావచ్చు లేదా కాకపోవచ్చు. వారికి సురక్షితమైన గర్భనిరోధకాలను అందించడం, లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, అసురక్షిత గర్భస్రావాలపై సరైన సమాచారాన్ని అందించడం ముఖ్యం.
పిల్లలు పుట్టే వయసు
చాలామంది మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. దానివల్ల 30 ఏళ్లు దాటిన కూడా పెళ్లి చేసుకోవడం లేదు. ఈ కారణంగా పిల్లలు పుట్టడం ఆలస్యం అవుతోంది. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో వారు కోరుకున్నప్పుడు పిల్లలు పుట్టరు. అది మానసిక, శారీరక ఒత్తిడికి దారితీస్తుంది. వారి అండాలు లేదా పిండాలను చిన్న వయస్సులోనే ఫ్రీజ్ చేయించడం, వంధ్యత్వాన్ని కవర్ చేసే ఆరోగ్య బీమా పొందడం మంచిది.
మెనోపాజ్
మహిళల్లో ఉండే ఈస్ట్రోజన్ అనే హార్మోన్, వారు 45 ఏళ్ల వయసు సమీపించేకొద్దీ క్రమంగా తగ్గడం మొదలవుతుంది. మెనోపాజ్ దశకు వచ్చేసరికి అది పూర్తిగా పోతుంది. దానివల్ల వారికి మానసిక, భావోద్వేగ పరమైన, శారీరక సమస్యలు వస్తాయి. హార్మోన్ రీప్లేస్మెంట్, కాల్షియం, విటమిన్ డి తీసుకోవడం, శారీరక కార్యకలాపాలు, మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల ఆ తర్వాత కూడా మరో 20-25 ఏళ్లు చాలా చురుగ్గా ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆస్టియోపోరోసిస్, కేన్సర్లు, మధుమేహం, గుండె కవాటాల వ్యాధులను నివారించవచ్చు.




