సింగరేణిలో డంపర్ మహిళా ఆపరేటర్లు!
త్వరలో నియామకాలు చేపట్టనున్న సంస్థ
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): సింగరేణి చరిత్రలో తొలిసారిగా భారీ డంపర్ల ఆపరేటర్లుగా కొందరు మహిళలకు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశంపై సింగరేణి యాజమాన్యం డంపర్ మహిళా ఆపరేటర్ల నియామకానికి శ్రీకారం చుట్టింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు, ఓవర్ బర్డెన్‌ను గని క్వారీ నుంచి ఉపరితలానికి రవాణా చేసేందుకు యాజమాన్యం 60 నుంచి 100 టన్నుల భారీ డంపర్లను వినియోగిస్తుంది.
సింగరేణిలో గత 50 ఏళ్లుగా నిర్వ హిస్తున్న ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇప్పటివరకు కేవలం పురుష ఆపరేటర్లు మాత్రమే ఈ భారీ డంపర్‌లను నడుపుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ గనుల్లో డంపర్ ఆపరేటర్లుగా పని చేయడానికి ఆసక్తి గల మహిళా ఉద్యోగుల నుంచి దాదాపు 35 మంది దరఖాస్త చేసుకున్నారు.
సింగరేణి యా జమాన్యం సిరిసిల్లలోని తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ (టైడ్స్)సంస్థ ద్వారా ఆసక్తి గల మహిళలకు కంపెనీ ఖర్చులతో భారీ వాహనాలపై ఉచిత డ్రైవింగ్ శిక్షణ అందించింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు యాజమాన్యం డంపర్ ఆపరేటర్లుగా నియమించనుంది.






