15 May, 2026 | 1:02 AM

బాధ్యతగా వ్యవహరించండి

15-05-2026 12:00 AM
  1. దేశ భవిష్యత్  కోసమే ప్రధాని 10 సూత్రాలు
  2. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి  
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పిలుపునిచ్చారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే బాధ్యత  ప్రభుత్వానిదే కాదని, ప్రజలపై కూడా ఉందన్నారు.

దేశ భవిష్యత్ దృష్ట్యా నరేంద్రమోదీ పేర్కొన్న 10 సూచనలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. దేశ ఆర్థిక స్వావలంభన, జాతీయ ప్రయోజనాలు, ప్రజల భాగస్వామ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన 10 సూచనలతో కూడిన పోస్టర్‌ను గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ సూచనలు రాజకీయ అంశాలు కావని, అవి దేశ ఆర్థిక భద్రత, సామాజిక బాధ్యతలకు సంబంధించినవని స్పష్టం చేశారు. ఆత్మనిర్భర్ లక్ష్య సాధనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమన్నారు. స్వదేశీ వస్తువుల వినియోగం, ఇంధన పొదుపు, దేశీయ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయన్నారు. 

ముఖ్యంగా లోకల్ ఫర్ వోకల్ భావనతో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవచ్చన్నారు.  

ప్రధాని సూచనలపై విమర్శలు చేయడం తగదు   

పొదుపు సూత్రాలకు సంబంధించి ప్రధాని మోదీ సూచనలపై కొందరు విమర్శలు చేయడం తగదని రాంచందర్‌రావు పేర్కొన్నారు. ఇంధన పొదుపు కోసం ప్రధాని స్వయంగా తన కాన్వాయ్‌లోని వాహనాలను తగ్గించుకొని ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రజలు కూడా అవసరమైనప్పుడు మాత్రమే వాహనాలు వాడాలని, హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న మెట్రో, ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను వినియోగించుకోవాలని కోరారు.

ఐటీ రంగంలో అమలవుతున్న కార్ పూలింగ్ విధానం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఇంధన పొదుపునకు ఎంతో మేలు చేస్తామన్నారు. గతంలో  మన్మోహన్‌సింగ్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఉన్న సమయంలోనూ దేశం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా కఠినమైన పొదుపు చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాని చేస్తున్న సూచనలను విమర్శించడం సరికాదని ఆయన హితవు పలికారు.

తాను కూడా ఇటీవల ఒక కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రజా రవాణాను వినియోగించానని, విదేశాల్లో ఉన్నతాధికారులు కూడా ఇవే పద్ధతులు పాటిస్తారని ఉదహరించారు. దేశాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని, ప్రధాని పిలుపును తెలంగాణ ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డా. కృష్ణారెడ్డి మోదీ సూచించిన సూత్రాలపై  విశ్లేషణ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, పదాధికారులు, అధికార ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.