గ్రామ సింహాల దాడిలో మహిళ మృతి
వీధి కుక్కలని నియంత్రించని పంచాయతీ సంస్థ
ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలం చాతకొండ గ్రామంలో వీధికుక్కల దాడిలో మహిళ అత్యంత దారుణంగా మృతి చెందింది. చాతకొండ గ్రామానికి చెందిన మారే రాములమ్మ అనే మహిళ సోమవారం ఉదయం పొలం పనుల నిమిత్తం దారి గుండా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వీధికుక్కల గుంపు ఆమెపై దాడి చేసి ప్రాణం హరించి వేసిన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఈ సంఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.
రాములమ్మను కుక్కలు వెంబడిస్తూ తీవ్రంగా గాయపరచడంతో, మహిళ అరుపులు విన్న స్థానికులు వెంటనే కుక్కలను తరిమికొట్టి రక్షించారు. గాయపడిన మహిళను హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. స్థానికుల సమాచారం ప్రకారం , గత కొంతకాలంగా వీధికుక్కల సంచారం అధికమవుతోందని స్థానికులు ,ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పొలం పనులకు వెళ్లే, రైతులు, మహిళలు, ఆరు బయట ఆడుకునే చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు స్పష్టం చేశారు.
ఎటు వైపు నుండి కుక్కలు దాడి చేస్తాయోనన్న భయంతో ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురవుతున్నారు. సంబంధిత ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, పంచాయితీ సర్పంచి ,ఉపసర్పంచ్లు, వార్డు మెంబర్లు, స్పందించి గ్రామంలో తిరుగుతున్న గ్రామ సింహాలను అదుపు చేసే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కుక్కలు మృతురాలి తలను ఛిద్రం చేసాయి. చికిత్స నిమిత్తం, స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి హుటాహుటిన తరలించగా, మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.






