25 May, 2026 | 3:40 PM

సీసీ కెమెరాల ఏర్పాటుపై భద్రతా సందేహాలు

25-05-2026 02:37 PM

జైనూర్,(విజయక్రాంతి): మండల కేంద్రం జైనూర్‌లో గ్రామ భద్రతను మెరుగుపర్చడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా పోలీసులు స్థానిక వ్యాపారుల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలకు ఈ కెమెరాలను అమర్చారు. అయితే వాటి ఏర్పాటు విధానంపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.సీసీ కెమెరాలకు సంబంధించిన వైర్లు బహిరంగంగా కనిపించడం, కొన్ని కెమెరాలను తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయడం వల్ల వాటిని ఎవరైనా సులభంగా ధ్వంసం చేసే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. గాలి, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో వైర్లు దెబ్బతిని వ్యవస్థ పనితీరుకు అంతరాయం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల భద్రత కోసం లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న నిఘా వ్యవస్థలకు తగిన రక్షణ చర్యలు తీసుకోకపోతే వాటి ప్రయోజనం తగ్గిపోతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సీసీ కెమెరాల కేబుళ్లను రక్షణ పైపుల ద్వారా అమర్చడం, కెమెరాలను మరింత ఎత్తులో భద్రంగా ఏర్పాటు చేయడం, పర్యవేక్షణ వ్యవస్థను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం వంటి చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. భద్రతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దీర్ఘకాలం సమర్థవంతంగా పనిచేయాలంటే సాంకేతిక పరమైన రక్షణ చర్యలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు.