25 May, 2026 | 3:56 PM

ధాన్యం కొనుగోలు చేయాలంటూ తంగళ్ళపల్లిలో రైతుల ఆందోళన.. రహదారిపై బైఠాయింపు

25-05-2026 02:43 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రైతులు ధాన్యం కొనుగోలు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వడ్లను అధికారులు వెంటనే కొనుగోలు చేయకపోవడంతో ఆగ్రహించిన రైతులు సిరిసిల్ల–సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.ధాన్యం కొనుగోలులో జాప్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోయారు.

వర్షాలు పడే అవకాశం ఉండటంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వడ్లు తడిసిపోతాయనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించాలని డిమాండ్ చేశారు.రైతుల ఆందోళనకు బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. వెంటనే వడ్లు తరలించకపోతే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటి ముందు వడ్లు పోసి నిరసన చేపడతామని రైతులు హెచ్చరించారు. రైతుల సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.