రుణ లక్ష్యం నెరవేరుతుందా?
- రూ. 3,546.80 కోట్ల రుణ ప్రణాళిక
- గత ఏడాది లక్ష్యాల సాధనలో వెనుకంజ..
- ఈసారి బ్యాంకులపై పెరిగిన బాధ్యత
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 26 (విజయ క్రాంతి ): జిల్లాలో 202627 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,546.80 కోట్ల వార్షిక రు ణ ప్రణాళికకు ఆమోదం లభించింది. ఇందు లో రూ. 2,642 కోట్లు వ్యవసాయ రంగానికే కేటాయించడం ద్వారా రైతులకు పెద్దపీట వేశారు. అయితే గత ఆర్థిక సంవత్సరంలో పలు పథకాల కింద నిర్దేశించిన రుణ లక్ష్యా లు పూర్తిగా సాధించలేకపోవడం నేపథ్యం లో, ఈసారి లక్ష్యాలను ఎలా చేరుకుం టా రన్నది ప్రధాన చర్చగా మారింది.
గత ఏడాది ఎందుకు వెనుకబడ్డారు..?
202526 ఆర్థిక సంవత్సరంలో ముఖ్యం గా స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో ఆశించిన పురోగతి కనిపించలేదు. మొత్తం 6,294 సంఘాలకు రూ.411 కోట్ల రుణాలు అందించాల్సి ఉండ గా, 2,609 సంఘాలకు మాత్రమే రుణాలు మంజూరయ్యాయి . ఇతర స్వయం ఉపాధి పథకాల అమలులో కూడా బ్యాంకుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే అభిప్రా యం వ్యక్తమవుతోంది.
ఈసారి భారీ లక్ష్యం...
కొత్త ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు రూ. 3,546.80 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్ణయించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.2,642 కోట్లు, మిగిలిన మొత్తాన్ని సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, సేవా రంగం, విద్యా రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, స్వయం ఉపాధి పథకాల కోసం కేటాయించారు. రైతులకు పంట రుణాలతో పాటు పాల డెయిరీలు, గొర్రెల పెంపకం, మత్స్య పరిశ్రమ, చేనేత, చిన్న పరిశ్రమలకు కూడా రుణాలు అందించాలని ప్రణాళిక రూపొందించారు.
లక్ష్య సాధనకు కార్యాచరణ...
రుణ లక్ష్య సాధనకు జిల్లా కలెక్టర్ కె. హరిత బ్యాంకులకు స్పష్టమైన కార్యాచరణను సూచించారు. ప్రతి నెలా రుణాల ప్రగతిని సమీక్షించడం, శాఖల వారీగా లక్ష్యాలను విభజించడం, పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించడం, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి రుణాలు అందించడం, పీఎం ముద్రా, పీఎం స్వనిధి, పీఎం ఈజీపీ వంటి పథకాల అమలును వేగవంతం చేయడం వంటి చర్యల ద్వారా లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకర్లు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తేనే వంద శాతం లక్ష్యాలు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.
బ్యాంకుల పనితీరుపైనే ఆధారం ...
ప్రభుత్వం భారీ రుణ ప్రణాళికను ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో బ్యాంకులు వేగంగా స్పందించి అర్హులైన వారికి రుణాలు అందిస్తేనే దీని ప్రయోజనం కనిపిస్తుంది. గత ఏడాది మాదిరిగా రుణాల మంజూరులో జాప్యం జరిగితే లక్ష్యాలు మరోసారి కాగితాలకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంటుంది. బ్యాంకుల పనితీరు, శాఖల సమన్వయం, నెలవారీ సమీక్షలే ద్వారా రుణ లక్ష్యాలను సాధించవచ్చు.






