27 June, 2026 | 2:51 AM

అధ్వాన్నంగా మారిన రహదారి

27-06-2026 12:13 AM
  1. చిన్న వర్షానికే గోతులుగా మారిన రోడ్డు...
  2. వాహనదారులకు తప్పని తిప్పలు 

భీమిని, జూన్ 26 : రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడంతో చిన్న పాటి జల్లులకే గోతులు ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. భీమిని మండలం లక్ష్మి పూర్ నుం చి కర్జి బీంపూర్ వరకు పది కిలోమీటర్ల మేర ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం కింద 2018లో రూ. 516.23 లక్షలతో రహదారి  నిర్మించారు. రోడ్డు నిర్మించి న ఐదు సంవత్సరాలకే నాణ్యత లోపించి గుంతలమయంగా మారింది.

కోట్లు వెచ్చించినా కాంట్రాక్టర్ నాసిరకంగా రోడ్డు వేయ డంతో అద్వాన్నంగా మారింది. ఈ దారిపై నిత్యం వాహనదారులు అధిక సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ఏర్పడ్డ గుంతలతో నిర్లక్ష్యంగా ప్రయాణిస్తే ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దారి వెంట మూలమలుపు ఉండడం, రహదారిపై తారు, కంకర పైకి తెలి పెద్ద పెద్ద గుంతలతో ఉండటం, దగ్గరికి వచ్చేంత వరకు గుంతలు కనిపించక పోవడంతో ప్రమాదాలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.

గుత్తేదారు గుంతల లో కనీసం మట్టి పోసి పూడ్చిన పాపాన పోలేదని ప్రజల మండిపడుతున్నారు. ముఖ్యంగా లక్ష్మి పూర్ చెరువు కట్ట ఆనుకోని ఉన్న ప్రాంతంలో రోడ్డు మొత్తం కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయని, వర్షాకాలంలో చెరువు సమీపంలో ఏర్పడిన గుంతలలో నీరు నిలిస్తే వాహనాలు నడపడం కష్టంగా ఉంటుందని వాపోతున్నారు. 

కోట్ల నిధులు నీళ్ల పాలు..

మండలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద చేపట్టిన రహదారి నిర్మాణం సదరు గుత్తేదారు నిబంధనలు పాటించకపోవడంతో రహదారి కాలపరిమితి ముందే పగుళ్లు తేలి గుంతలమ యమైంది. సంబంధిత శాఖ అధికారుల రోడ్డు నిర్వహణపై పర్యవేక్షణ కొరవడటంతో కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం వ్యర్థమైందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు రహదారిని మరమ్మత్తులు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.