7 June, 2026 | 1:24 AM

సీఎం వరాల జల్లు కురిపించేనా..!?

07-06-2026 12:00 AM
  1. నేడు రేవంత్‌రెడ్డి జిల్లాకు రాక 
  2. ఎంఎంసీ భవనానికి శంకుస్థాపన 
  3. జిల్లా ప్రజల ఆశలన్నీ రేవంత్ పైనే..

మేడ్చల్, జూన్ 6 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వస్తున్న సందర్భంగా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆదివారం ఉప్పల్ భాగాయత్ లో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి జిల్లాకు వస్తున్నారంటే జిల్లాలోని ప్రధాన సమస్యలను పరిష్కరిస్తారని, అభివృద్ధి పనులకు పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తారని ప్రజలు ఆశించడం సహజం. జిల్లాలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు.

కొన్నింటికైనా నిధులు మంజూరు చేస్తారని ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వం జిల్లాలోని పంచాయతీలన్నీ మున్సిపాలిటీలలో, మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేసి చేతులు దులుపుకుంది. తదుపరి మున్సిపాలిటీలకు, మున్సిపల్ కార్పొరేషన్ లకు నిధులు మంజూరు చేయలేదు. జిల్లాలో ఎల్లంపేట, అలియాబాద్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. వీటిలో నిధుల కొరత ఉంది.

జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ లో, మరికొన్ని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లలో అభివృద్ధి పనులు చేపట్టడానికి నిధులు లేవు. కార్పొరేషన్ల పరిధిలో పాలన అస్తవ్యస్తంగా తయారయింది. డ్రైనేజీలు పొంగి రోడ్లమీద ప్రవహిస్తున్నాయి. రోడ్లు గుంతల మయ్యమయ్యాయి. ఐఏఎస్ అధికారులకు పాలన అప్పగించినప్పటికీ ఆశించిన స్థాయిలో పాలన కనిపించడం లేదు.

రోడ్ల మీద కనీసం  ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కార్పొరేషన్ల పరిధిలో మౌలిక వసతుల కోసం పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. విద్యారంగంలోనూ సమస్యలు  వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల ఒకే ఆవరణలో పాఠశాల, కళాశాలలు నిర్వహించడంతో ఇబ్బంది ఎదురవుతుంది.

కొన్నిచోట్ల కొత్తగా కళాశాలలకు, పాఠశాలల ఏర్పాటుకు స్థానికుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. జవహర్ నగర్ పరిధిలోని గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు ఇటీవల మానవహారం నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గం లో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని స్థానికుల కోరుతున్నారు. 

డంపింగ్ యార్డ్‌తో సతమతం..

జవహర్ నగర్ డంపింగ్ యార్డ్‌తో ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. రామ్ కి సంస్థ నిర్వహణ లోపం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. హైదరాబాద్ మహానగరం చెత్త మొత్తం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కి తీసుకు వస్తున్నారు. దుర్వాసనతో ప్రజలు అవస్థ పడుతున్నారు. భూగర్భంలో జలాలు కూడా కలుషితమవుతున్నాయి.

ఇటీవల అఖిలపక్ష నాయకులు సీఎంను కలిసి సమస్యను వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం డంపింగ్ యార్డ్ విషయంలో చొరవ తీసుకొని అధికారులచే అఖిలపక్ష నాయకుల సమావే శం ఏర్పాటు చేయించారు. డంపింగ్ యార్డ్ విషయంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేస్తారని ఆశతో స్థానికులు ఉన్నారు.