1 August, 2026 | 1:56 AM

ధరల పెరుగుదలను తక్షణమే అరికట్టాలి

01-08-2026 12:04 AM

జెంజి ఉద్యమం చరిత్రలో ఒక మైలురాయి

ఆగస్టు 6 నుంచి రాష్ట్రవ్యాపితంగా విస్తృత ప్రజా చైతన్య యాత్రలు.

సెప్టెంబర్ 1న ’చలో ఢిల్లీ’ని జయప్రదం చేయాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

పాల్వంచ, జులై 31 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు.

సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల-పట్టణ కార్యదర్శులు, ప్రజాసంఘాల జిల్లా బాధ్యుల సమావేశం శుక్రవారం పాల్వంచలోని సిపిఐ కార్యాలయం ’సిఆర్ భవన్’లో జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల సామాన్య ప్రజలు, కార్మికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను అరికట్టడంలో, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంలో కేంద్రం విఫలమైందన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక హక్కులను పరిరక్షించడంతో పాటు, ప్రజాస్వామ్య వ్యవస్థలో నమ్మకాన్ని పెంచేందుకు బ్యాలెట్ పేపర్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద యువత చేపట్టిన పోరాటం చారిత్రాత్మక విజయంగా ముగియడం ఆయన హర్షం వ్యక్తం చేశారు.

దేశ యువత పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగిరాక తపలేదుని, జెంజి ఉద్యమం చరిత్రలో ఒక మైలురాయి అని అన్నారు. దళిత, ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులను అరికట్టాలని, పేదలకు సార్వత్రిక విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్ర పరిధిలోని ఈ ప్రధాన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వారిని చైతన్యపరచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి 14 వరకు పార్టీ ఆధ్వర్యంలో ’ప్రజా చైతన్య యాత్రలు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న నిర్వహించే ’చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా మాట్లాడుతూ జిల్లా రహితంగానికి సీతారామ జలాల దక్కాలని, పెండింగ్ పోడు పట్టాలు పేదలకు ఇండ్లు దక్కేవరకు పోరాడాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 6 నుంచి జిల్లాలో ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. పాల్వంచలో 800 మెగావాట్ల సామర్థ్యం గల రెండు విద్యుత్ ప్లాంట్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈనెల 6 నుంచి 12 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం జిల్లా కార్యవర్గ సభ్యులు నానాటి ప్రసాద్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ సరిరెడ్డి పుల్లారెడ్డి సలీం ఉప్పు శెట్టి రాహుల్ కందల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.