డిగ్రీకి ర్యాంకులు రావా?
- ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో డిగ్రీ కాలేజీలు వెనుకంజ
- 1,099 కాలేజీల్లో ర్యాంకింగ్ సొంతం చేసుకున్నవి ఆరే
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు విద్యాప్రమా ణాలు పాటించడంలో వెనుకంజలో ఉన్నాయి. ఇప్పటినుంచే కాదు.. గత కొన్నేండ్లుగా నేషనల్ ఇన్‌స్టిట్యూష నల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్‌ఐఆర్‌ఎఫ్) ర్యాంకింగ్‌ను సాధించడంలో వెనుకబడుతున్నాయి. సర్కారు కాలేజీలే కాదు, ప్రైవేట్ కాలేజీలు సైతం మెరుగైనా ఫలితాలను సాధించలేకపోతున్నాయి.
తెలంగాణలో డిగ్రీ కాలేజీల పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. మనకంటే ఇతర రాష్ట్రాల కాలేజీలు ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాకింగ్ లో ముందువరుసలో ఉంటున్నాయి. మంచి విద్యాప్రమాణాలు, ఫ్యాకల్టీ, అడ్మిషన్లు, మౌలిక వసతులు, ల్యాబ్‌లు, రీసెర్చ్ లాంటి 14 అంశాలను పరిగణలోకి తీసుకొని ఎన్‌ఐఆర్‌ఎఫ్ కాలేజీలకు ర్యాంకింగ్ ఇస్తారు. రాష్ట్రంలో మొత్తం 1,099 కాలేజీలుండగా, ప్రభుత్వ కాలేజీలు 149 ఉన్నాయి.
అయితే వీటిలో పదుల సంఖ్యలో మాత్రమే ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌కు పోటీ పడుతున్నాయి. 149 ప్రభుత్వ కాలేజీల్లో రెండు కాలేజీలు మాత్రమే కనీస స్కోర్‌ను కలిగి ఉన్నాయి. వీటిలో సిటీ కాలేజీ కేవలం 39.05 స్కోరును, బేగంపేట ఉమె న్స్ కాలేజీ 35.03 స్కోర్‌ను మాత్రమే కలిగి ఉన్నాయంటే మిగతా కాలేజీల పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు. వంద స్కోర్ పొందితేగానీ ర్యాంక్ వచ్చే పరిస్థితి లేదు. ఈ ర్యాంకింగ్‌లో చోటు దక్కాలంటే అన్ని వసతులతోపాటు సరిపడా సిబ్బంది ఉండాలి.
మన రాష్ట్రంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే కాలేజీలు ఈ ర్యాంకింగ్ కోసం పోటీపడుతున్నాయి. ఇక ర్యాంకిం గ్ సొంతం చేసుకుంటున్న కాలేజీలు ఆరులోపే ఉన్నా యి. 2024, 2025 ఏడాదిలో ఒక్క కాలేజీ కూడా వందలోపు ర్యాంకును సాధించలేకపోయింది. 2024లో 101-150 లోపు ర్యాంకులో రెండు కాలేజీలుండగా, 151-200 ర్యాంకులోపు రెండు కాలేజీలు న్నాయి. ఇక 201-300 ర్యాంకులోపు మరో రెండు కాలేజీలున్నాయి. 2025లోనూ 101-150 ర్యాంకులోపు ఒక్కటే కాలేజీ ఉండగా, 151-200 ర్యాంకులోపు మూడు కాలేజీలు, 201-300ర్యాంకులోపు రెండు కాలేజీలు మాత్రమే ఉన్నాయి.
రెగ్యులర్ అధ్యాపకులు 1,600 మందే..
ర్యాంక్ రావడంతో కాలేజీలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. దీంతో అడ్మిషన్లు నిండుతాయి. ప్రతిభావంతులైన విద్యార్థులుగా బయటికివచ్చి వారికి మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల పరిస్థితి దారుణంగా ఉంది. ఫ్యాకల్టీలు సరిగా ఉండవు, ల్యాబ్‌లు ఉండవు. ఇవి లేకుండా పరిశోధనలు ఎలా సాధ్యమని అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో ఉండే సర్కారు డిగ్రీ కాలేజీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
ఆయా కాలేజీల్లో విద్యార్థులు చేరేందుకు ఇష్టపడరు. పట్టణ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్ట పడతారు. దీంతో అక్కడ సీట్లు నిండవు.. ఒకవేళ సీట్లు నిండినా సరిపడా అధ్యాపకులుండరు. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ప్రమాణాలేమో విద్యార్థి అధ్యాపక నిష్పత్తి ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడు (1:20) ఉండాలం టుండగా, కాలేజీల్లో దాదాపు 1:100 చొప్పున ఉంటున్నారు.
ఈ వ్యత్యాసాన్ని భర్తీ చేయాలంటే నియామక ప్రక్రియను చేపట్టాలి. ప్రభు త్వ కాలేజీల్లో మొత్తం 4,999 సాంక్షన్డ్ పోస్టులుంటే అందులో ప్రస్తుతం పనిచేస్తున్న రెగ్యు లర్ అధ్యాపకులు 1,600 మంది మాత్రమే. అంతాగెస్ట్, కాంట్రాక్ట్‌పద్ధతిలో అధ్యాపకులను తీసుకుంటున్నారు. ఇలా ఉంటే జాతీయ స్థాయిలో సర్కారు కాలేజీలు ఎలా పోటీపడతాయి? అని ప్రశ్నిస్తున్నారు.
వసతులు నిల్..
కొన్ని కాలేజీలకు సొంత భవనాలు లేవు. ఉన్న వాటికేమో సరిపడా ల్యాబ్‌లులేవు.. ఉన్నా పరిశోధనలకు అధ్యాపకులు లేరు. డిగ్రీ కాలేజీల్లోని అధ్యాపకులకు గైడ్‌షిప్ ఇవ్వడంలేదు. ప్రైవేట్‌కాలేజీల్లోని వారికి గైడ్‌షిప్ ఇస్తున్నారు. పైగా గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల్లో చేరకుండా పట్టణ ప్రాంతాలకు విద్యా ర్థులు వలస వెళ్తున్నారు. అంతేకాకుండా మన దగ్గర సీట్లు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. దీంతో అవి నిండకున్నా ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకిగ్‌లో ప్రామాణికంగా తీసుకుంటారు.
ఇది కూడా ఒక కారణమే. 2025-26 విద్యాసంవత్సరానికి గానూ ప్రభు త్వ ప్రైవేట్‌లో కలిపి 4.57 లక్షల సీట్లుంటే అందులో దాదాపు 2.20 లక్షలసీట్లు మాత్రమే నిండుతున్నాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 89 వేల సీట్లకు సుమారు 55 వేల వరకు మాత్రమే నిండుతున్నాయి. ఎన్‌ఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్‌లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఒక్కో కేటగిరీకి స్కోర్‌ను నిర్ణయిస్తారు.
ఉత్తమమైన స్కోర్ సాధించిన వాటికి 100లోపు, 101-200 లోపు, 201-300 లో పు ర్యాంకులను నిర్ణయిస్తారు. ఈ ర్యాంకులను సాధిస్తున్న కాలేజీల్లో అధికంగా ఉత్తర భారతదేశానికి చెందని కాలేజీలే ఎప్పుడూ ఉంటు న్నాయి. ఫ్యాకల్టీ కొరత, ఇబ్బడిముబ్బడిగా సీట్లు పెంచుకోవడాలు లాంటివి అక్కడ ఉండదు. సరిపడా బడ్జెట్‌ను కాలేజీలకు లేకపోవడం మరోకారణం.




