తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత సి. జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు రోజుల తీవ్ర రాజకీయ అనిశ్చితి అనంతరం, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై ఎట్టకేలకు స్పష్టత లభించింది. ఆదివారం చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం కాన్వాయ్‌లో బయల్దేరిన టీవీకే అధినేత విజయ్ 10 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.
విజయ్ తో సీఎంగా గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. విజయ్ తో పాటు మరో 9 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారానికి ముందే మంత్రులకు శాఖల కేటాయించారు. హోం, ప్రజాపాలన శాఖలకు సీఎం విజయ్, ఆధవ అర్జున్ – క్రీడలు, ఎక్సైజ్ శాఖ, కే.ఎ.సెంగొట్టాయన్ – పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD), వెంకట్రామన్ – పాఠశాల విద్యాశాఖ, ఎన్. ఆనంద్ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నిర్మల్ కుమార్ – విద్యుత్ శాఖ, రాజమోహన్ – ఆదిద్రవిడ సంక్షేమ శాఖ, అరుణ్ రాజ్ – కమర్షియల్ ట్యాక్సెస్ & రిజిస్ట్రేషన్ శాఖ.. కీర్తన, టీకే ప్రభులకు ఇంకా శాఖలు కేటాయించలేదు.
1967 నుండి, రెండు ప్రధాన ద్రవిడ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలలో ఏ ఒక్కదానికీ చెందని రాష్ట్రపు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన వారిలో రాహుల్ గాంధీ, విజయ్ తల్లిదండ్రులైన ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్, అలాగే త్రిష కృష్ణన్‌తో సహా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారు.






