10 May, 2026 | 11:26 AM

రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి

10-05-2026 10:24 AM

వివోఏల ఉద్యోగ భద్రత కోసం మంత్రి పొంగులేటికి వినతి

తిరుమలాయపాలెం,(విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలో విధులు నిర్వహిస్తున్న 66 మంది వివోఏలు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ శనివారం జరిగిన ప్రజా దర్బార్ లో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. గత 20 సంవత్సరాలుగా గ్రామీణ స్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ ఇప్పటికీ తమకు సరైన గుర్తింపు లేకపోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించడం నుంచి స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వరకు అనేక బాధ్యతలను నిర్వర్తిస్తున్నామని తెలిపారు. ఎస్‌సీఆర్‌పీ, ఐకేపీ పరిధిలో అప్పగించే ప్రతి పనిని కష్టపడి నిర్వహిస్తున్నప్పటికీ కనీస ఉద్యోగ భద్రత కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇప్పటి వరకు డ్రెస్ కోడ్, ఐడి కార్డులు, స్థిరమైన వేతన విధానం వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా కల్పించలేదని పేర్కొన్నారు. పని భారం రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అందుతున్న వేతనం కుటుంబ పోషణకు సరిపోవడం లేదని, భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన నెలకొందని తెలిపారు.

ప్రభుత్వం తమ సేవలను గుర్తించి వివోఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పని గంటలను తగ్గించి గౌరవప్రదమైన వేతనం అమలు చేయాలని కోరారు. ప్రతి వివోఏ కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సేవా భద్రతతో పాటు కుటుంబాలకు రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇరవై ఏళ్లుగా ప్రజల మధ్యే పనిచేస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి న్యాయం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరినట్లు వివోఏలు తెలిపారు.