05-02-2026 12:36:54 AM
రాకపోకలకు గిరిజనుల అవస్థలు
ఉట్నూర్, ఫిబ్రవరి ౪ (విజయక్రాంతి): అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో రోడ్ల దుస్థితి అధ్వాన్నంగా మారడంతో ప్రజ లు, ముఖ్యంగా గిరిజనులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల రోడ్లు, కల్వర్టులు వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు గుంతల మయం కావడంతో పాటు కోతులకు గురైయ్యాయి.
మరికొన్ని చోట్ల తక్కువ ఎత్తు లో కల్వర్టులు ఉండడంతో వర్షాకాలంలో వరదనీటి ప్రభావంతో రాకపోకలకు గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏండ్ల కింద ట నిర్మించిన కల్వర్టులు శిథిలావస్థకు చేరగా, నడవలేని స్థితికి చేరిన రోడ్లతో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు, వాహనదారులు తీవ్ర నరకయతనను అనుభవిస్తున్నారు.
కాంట్రాక్టర్‌లు ముందుకు రాక..
ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో రహదారుల మరమ్మత్తులకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక కృషితో రూ.36.95కోట్ల నిధు లు మంజూరయ్యాయి. మంజూరైన నిధులకు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు మూడుసార్లు టెండర్లు పిలిచిన మర మ్మత్తులు పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ లు ముందుకు రాక పోవడంతో పనులు సాగ డం లేదు. దీంతో ఎన్నో ఏళ్ల నుండి రోడ్లు మరమ్మతుకు నోచుకోవడం లేదు. రహదారులకు మరమ్మత్తులు చేయకపోవడంతో రాకపో కలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతిపాదనలు పంపిన నిధుల కొరత
మరోవైపు నార్నూర్, గాదిగూడ మండలాల్లో గుంతలమైన రోడ్లకు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ నిధుల కొరత కారణంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయితే తప్ప రోడ్లకు మరమ్మత్తులు జరిగే ప్రసక్తి లేదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల రోడ్లకు మరమ్మత్తులు చేయాలని గిరిజనులు కోరుతున్నారు..