12 March, 2026 | 11:36 AM

ఫాగింగ్ మిషన్ ఎక్కడ?

12-03-2026 12:00 AM
  • ఎటూ తేల్చని అధికారులు                      
  • రోజులు గడుస్తున్నా విచారణ పేరిట జాప్యం
  • తొందరగా తేల్చాలంటున్న నామవరం పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు

మోతె, మార్చి 11: మండలంలోని నామవరం గ్రామంలో ఫాగింగ్ మిషన్ కనిపించకుండా పోవడంతో అధికారులు ఫిర్యాదు చేసి నెలరోజులైనట్లు తెలుస్తుంది. నెలరోజులుగా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై పాలకవర్గ సభ్యులు సైతం ఏమి తేలట్లేదని చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది.

ఇంత జరిగినా విషయం బయటికి రాకుండా దాయడంతో పాటుగా దీన్ని తెలిసిన తర్వాత కూడా ఎటు తేల్చకపోవడం వెనుక అంతర్యం ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నట్టు వినికిడి. వేసిన తాళం వేసినట్లుగానే ఉంది పంచాయతీ కార్యదర్శి దగ్గర ఒక తాళం చెవి, సంబంధిత ఏఈవో దగ్గర ఒక తాళం చెవి ఉండగా  రైతు వేదికలో ఉన్న ఫాగింగ్ మిషన్ ఎటు పోయింది అంటూ గ్రామస్తుల మధ్య పెద్ద చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. 

పంచాయతీ కార్యదర్శి, ఏఈఓల వద్ద తాళం చెవిలు ఉండగా ఫాగింగ్ మిషన్ ఎలా కనిపించకుండా పోతుందంటూ పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానికంగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పంచాయతీ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదులో గ్రామపంచాయతీ సిబ్బంది మీదే అనుమానం ఉందని ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ కోణంలోనే పోలీసులు కూడా విచారణ చేపట్టినట్టు వార్తలు బయటికి వస్తున్నాయి. 

గతంలోనూ ఇదే తంతు! : 

గతంలోనూ ఇదే గ్రామపంచాయతీలో ఓ మాజీ సర్పంచ్ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆనాటి ఉపసర్పంచ్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చి విచారణ చేసిన అనంతరం నాటి సర్పంచ్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో నాడు ఆ విషయంపై పలు విమర్శలు వచ్చాయి.

అప్పుడు అవినీతి చేసినటువంటి వ్యక్తుల మీదనే ఎటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి ఏం చేసినా ఈసారి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదన్న ఉద్దేశ్యంతో ఇటువంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని అభిప్రాయాలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ ఫాగింగ్ మిషన్ ను కూడా కొందరు కావాలనే మాయం చేసినట్టు గ్రామంలో చర్చలు సాగుతున్నట్లు సమాచారం.

ఆరోజునే చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు ఇటువంటి వాటికి అవకాశం ఉండేది కాదని గ్రామానికి చెందిన పలువురు తమ సన్నిహితుల వద్ద అభిప్రాయాలు వెళ్లబుచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికైనా ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో విచారణ చేసి ఫాగింగ్ మిషన్ ఎవరి వద్ద ఉందో గుర్తించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు దాన్ని తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని స్థానిక పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు.