సలహాలెక్కడ?
- ప్రభుత్వ సలహాదారులు అలంకారప్రాయమేనా?
- సర్కారుకు వరుస ఎదురుదెబ్బలెందుకు
- పరిపాలన నిర్ణయాలపై వివాదాలు
- సమస్యాత్మక పరిణామాలపై ముందస్తు హెచ్చరికలేవీ?
- శాఖల సమీక్షల్లో కనిపించని సలహాదారులు
- చర్చనీయాంశంగా వారి పనితీరు
హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేం దుకు నిపుణులు.. కీలక శాఖలకు మార్గనిర్దేశం చేసేందుకు సలహాదారులు.. నిర్ణ యాలకు ముందు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అనుభవజ్ఞులు.. ఇంత టి సలహా వ్యవస్థ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు వరుసగా వివాదాల్లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
అసలు సలహాదారులు ఏం చేస్తున్నారు? వారు ప్రభుత్వానికి సూచనలు ఇస్తున్నా రా? ఇస్తే వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటున్నదా? లేక సలహాదా రుల వ్యవస్థ కేవలం అలంకారప్రాయం గా మారిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ, పరిపాలనా వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం సాధారణ ప్రక్రియ.
ఆయా రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులను సలహాదారులుగా నియమించడం ద్వారా నిర్ణయాల్లో లోపాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. చట్ట పరమైన చిక్కులు, ప్రజలపై ప్రభావం, ఆర్థిక భారం, రాజకీయ పరిణామాలు, ప్రత్యామ్నాయ మార్గాలను విశ్లేషించి ప్రభుత్వానికి సూచనలు చేయడం వారి ప్రధాన బాధ్యత. అయితే నిర్ణయం తీసుకున్న తర్వాత దానిని సమర్థించడం కంటే.. నిర్ణయానికి ముందే సమస్యలను గుర్తించి హెచ్చరించడమే సలహాదారుల అసలు పాత్రగా భావిస్తారు.
ఇటీవల 22-ఏ నిషేధిత భూములకు సంబంధించిన అంశం ప్రభుత్వ నిర్ణయాలపై ప్రశ్నలు లేవనెత్తింది. లక్షలాది ఆస్తులపై అయోమయం నెలకొన్నదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ శాఖ నిర్ణయాలపై బీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందిస్తూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని డిమాండ్‌చేస్తున్నది.
ఇలాంటి కీలక అంశంలో నిర్ణయం తీసుకునే ముందు చట్టపరమైన, పరిపాలనా, ప్రజాపరమైన అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించారా? అధికారుల నివేదికలను పరిగణనలోకి తీసుకున్నారా? నిపుణుల అభిప్రాయాలను స్వీకరించారా? సలహాదారుల సూచనలు ఏమి టి? ఒకవేళ సూచనలు చేసి ఉంటే వాటిని ఎందుకు అమలు చేయలేదు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అసలు బాధ్యతేంటి.. వారు చేస్తున్నదేంటి?
ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తర్వాత ప్రతిపక్షాల విమర్శలు, ప్రజల్లో వ్యతిరేకత, న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తమైతే సలహాదారులుగా స్పందించడం ఒక అంశం. కానీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే అంచనా వేసి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం సలహాదారుల అసలు బాధ్యత. నిర్ణయం తీసుకునే ముం దు ప్రమాదాలను గుర్తించగలిగితే ప్రభుత్వానికి రాజకీయంగానూ, పరిపాలనాపరంగానూ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది.
భూములు, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, సాగునీరు, పట్టణాభివృద్ధి, మౌలిక వసతులు వంటి అంశాలు నేరుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. వీటిపై చిన్నపాటి నిర్ణయం కూడా పెద్ద రాజకీయ, సామాజిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉన్నది. అందుకే ఆయా రంగాల నిపుణుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సలహాదారులకు ప్రభుత్వం వేతనాలు, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నది.
ప్రజాధనంతో నియమితులై నవారు ప్రభుత్వ నిర్ణయ ప్రక్రియకు ఎంత మేర విలువ జోడిస్తున్నారు? వారి సూచనలు ఎన్ని అమలయ్యాయి? వారు ఇచ్చిన నివే దికలు ఎన్ని? ఏయే వివాదాలను ముందుగానే గుర్తించి ప్రభుత్వా న్ని అప్రమత్తం చేశారు? అనే అంశాలపై కూడా పారదర్శకత అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలహాదారు పదవీ కేవలం అధికారిక హోదాగా మారకుండా.. దానికి నిర్దిష్ట బాధ్యతలు, లక్ష్యాలు, పనితీరు సమీక్ష ఉండాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్నది.
ప్రభుత్వ నిర్ణయాలు వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్న సమయంలో సలహాదారుల వ్యవస్థ పనితీరును ఒకసారి సమీక్షించాల్సిన అ వసరం ఉందా? అన్న ప్రశ్నకు ప్రాధాన్యం పెరుగుతున్నది. ఎవరు ఏ శాఖకు సలహాదారు? వారి బాధ్యతలు ఏమిటి? ఇప్పటివరకు ఇచ్చిన సూచనలు ఏమిటి? ప్రభుత్వం వాటిలో ఎన్ని అమలు చేసింది? ఏ నిర్ణయాల్లో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది? వంటి అంశాలు స్పష్టమైతే సలహాదారుల వ్యవస్థపై ప్రజలకు కూడా అవగాహన ఏర్పడుతుంది.
సలహాదారులు ఉన్నంత మాత్రాన సరిపోదు.. వారి సలహాలు ప్రభుత్వ నిర్ణయాల్లో ప్రతిఫలించాలి. నిర్ణయాలకు ముందే లోపాలను గుర్తించి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయగలిగితేనే ఆ వ్యవస్థకు సార్థకత ఉంటుంది. లేకపోతే ప్రజాధనంతో నియమితులైన సలహాదారులు కేవలం ‘ఉత్సవ విగ్రహాలుగా’ మిగిలిపోతున్నారన్న విమర్శలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ప్రభుత్వంలో సలహాదారులకు కొదవేదీ..
రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలు, అంశాలకు సంబంధించి పలువురు సలహాదారులు కొనసాగుతున్నారు. సీఎం ముఖ్య సలహా దారుగా రామకృష్ణారావు ఉండగా.. సుదర్శన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కే కేశవరావు, హర్కర వేణుగో పాల్, షబ్బీర్ అలీ, జితేందర్‌రెడ్డి, ఆదిత్యనాథ్, ఎన్వీఎస్ రెడ్డి, వీ హనుమంతరావు, శివధర్‌రెడ్డి, గోవింద హరి తదితరులు వివిధ బాధ్యతల్లో ఉన్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని వ్యవసాయశాఖ సలహాదారుగా, కే కేశవరావును పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా, హర్కర వేణుగోపాల్‌ను ప్రొటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుగా ప్రభుత్వం నియ మించింది.
ఆయా రంగాల్లో అనుభవాన్ని ప్రభుత్వ నిర్ణయాలకు ఉప యోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈ నియామకాలు జరిగాయి. వీరితోపాటు నీటిపారుదలశాఖకు గౌరవ సలహాదారుగా మాజీ సైనికాధికారి లెఫ్టినెంట్ జనరల్ హర్పల్ సింగ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి 2025 ఆగస్టు 20న ఉత్తర్వులు జారీ చేశారు. క్యాన్సర్ నివారణకు ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఎత్తిపోతల పథకాల సలహాదారుగాకే పెంటారెడ్డి తదితరులు కొనసాగుతున్నారు.
సలహాదా రులుగా నియమితులైన వారు తమకు కేటాయించిన శాఖలకు, అంశాలకు సంబంధించి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారా? సంబంధిత శాఖల అధికారులతో సమావేశమై సమస్యలను గుర్తిస్తున్నారా? సీఎంకు నివేదికలు సమర్పిస్తున్నారా? కీలక నిర్ణయాల కు ముందు ప్రత్యామ్నాయాలను సూచిస్తున్నారా? అన్నది ఇప్పు డు ప్రధానచర్చగా మారింది.
కొంతమంది సలహాదారులు తమకు సంబంధించిన శాఖల సమీక్షల్లో కూడా క్రమం తప్పకుండా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం స్థాయిలో ప్రత్యేకంగా సమావేశమై కీలక అంశాలపై చర్చిస్తున్నారా? అన్నదానిపైనా స్పష్టత లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.






