22 July, 2026 | 2:29 AM

ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలి

22-07-2026 01:55 AM

రోడ్డు భద్రతపై రవాణ శాఖ కమీషనర్ ఇల్లంబర్తి నిర్వహించిన వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, పోలీస్ కమీషనర్ సునీల్ దత్

ఖమ్మం, జూలై- 21(విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టి జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ప్రమాణాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం రాష్ట్ర రవాణ శాఖ కమీషనర్ ఇల్లంబర్తి హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, సంబంధిత శాఖల అధికారులతో జాతీయ రహదారులపై రోడ్డు భద్రత చర్యలు, ప్రమాదాల నివారణ, సుప్రీం కోర్టు మార్గదర్శకాల అమలు, అనుసరణ (కంప్లయన్స్) నివేదికల సమర్పణ, ప్రమాదాల తగ్గింపునకు తీసుకోవాల్సిన చర్యలు, జాతీయ రహదారుల వెంట ఉన్న ఆసుపత్రుల మ్యాపింగ్, ఆక్రమణల తొలగింపు,

అత్యవసర స్పందన వ్యవస్థ, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఖమ్మం పోలీస్ కమీషనరేట్ కార్యాలయం నుండి సిపి సునీల్ దత్ ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించినవి, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు.

మున్సిపల్ ప్రాంతాల్లోని ప్రధాన రహదారులు, క్రిటికల్ జంక్షన్లలో అవసరమైన రోడ్డు భద్రతా పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి ట్రాఫిక్ ఉల్లంఘనను నమోదు చేసి నిబంధనల ప్రకారం జరిమానాలు విధించే వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులో ఉంచి, జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన అందించాలని, అంబులెన్స్ సేవలు కూడా దానికి అనుసంధానమై ఉంచాలని తెలిపారు. జాతీయ రహదారు లకు సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల మ్యాపింగ్ పూర్తిస్థాయిలో ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ ఎస్‌ఇ యుగంధర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రామారావు, నేషనల్ హైవే పిడి దివ్య, వివిధ శాఖల అధికారులు,  తదితరులు పాల్గొన్నారు.